
జలజ్ సక్సేనా (PC: X)
జలజ్ సక్సేనా (Jalaj Saxena).. దేశవాళీ క్రికెట్‌లో అతడొక దిగ్గజం. రంజీ ట్రోఫీ (Ranji Trophy) చరిత్రలో ఇప్పటి వరకు ఏడు వేలకు పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. అంతేకాదు.. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఖాతాలో 484 పైగా వికెట్లు కూడా ఉన్నాయి.
టీమిండియాకు ఆడే అవకాశమే రాలేదు
టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev), మదన్ లాల్, రవీంద్ర జడేజా తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఈ మేరకు భారీగా పరుగులు రాబట్టడంతో పాటు.. వికెట్లు తీసిన ఘనత జలజ్ సక్సేనాదే. అయితే, 38 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్ వెటరన్ ప్లేయర్‌కు టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం మాత్రం ఇంత వరకు రాలేదు.
కేరళ టు మహారాష్ట్ర
ఇదిలా ఉంటే.. దేశీ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం పాటు కేరళకు ప్రాతినిథ్యం వహించిన జలజ్ సక్సేనా.. తాజా రంజీ సీజన్‌లో మహారాష్ట్రకు మారాడు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ 2025-26 ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా మహారాష్ట్ర బుధవారం కేరళతో మ్యాచ్ మొదలుపెట్టింది.
తిరునంతపురం వేదికగా టాస్ ఓడిన మహారాష్ట్ర.. కేరళ జట్టు ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, కేరళ బౌలర్ల ధాటికి మహారాష్ట్ర టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు పృథ్వీ షా, అర్షిన్ కులకర్ణితో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ డకౌట్ అయ్యారు.
హాఫ్ సెంచరీ మిస్.. అయినా భేష్
కెప్టెన్ అంకిత్ బవానే కూడా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (91) నెమ్మదిగా క్రీజులో నిలదొక్కుకోగా.. ఏడో స్థానంలో వచ్చిన జలజ్ సక్సేనా కూడా ఆకట్టుకున్నాడు. మొత్తంగా 106 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 49 పరుగులు చేశాడు.
ఒక్కసారి కూడా ఆడలేదంటే ఆశ్చర్యమే
ఈ క్రమంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న టీమిండియా మాజీ సెలక్టర్లు సలీల్ అంకోలా, చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జలజ్ సక్సేనాను ఉద్దేశించి..‘‘సక్సేనా టీమిండియాకు ఒక్కసారి కూడా ఆడలేదంటే ఆశ్చర్యంగా ఉంది’’ అని సలీల్ అన్నాడు.
నువ్వు చైర్మన్‌వి కూడానూ
ఇందుకు బదులిస్తూ.. ‘‘సలీల్.. నువ్వు.. ఆశ్చర్యకరం అనే మాటను ఉపయోగించావు. అయితే, నీకో విషయం చెప్పాలి. మన ఇద్దరం మాజీ సెలక్టర్లమే’’ అని చేతన్ శర్మ నవ్వులు చిందించాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘నువ్వు చైర్మన్‌వి కూడానూ’’ అంటూ చేతన్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు సలీల్.
దీంతో.. ‘‘నిజమే.. వేళ్లన్నీ మన వైపే చూపించేవి’’ అని చేతన్ శర్మ కవర్ చేశాడు. ఏదేమైనా ప్రతిభ ఉన్న జలజ్ సక్సేనాకు అంతర్జాతీయ క్రికెట్‌లో కనీసం అరంగేట్రం చేసే అవకాశం రాకపోవడం పట్ల నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నవ్వుతూనే అయినా తప్పును ఒప్పుకొన్నారంటూ మాజీ సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు.
239 పరుగులకు ఆలౌట్
ఇదిలా ఉంటే.. కేరళతో మ్యాచ్‌లో మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 239 పరుగులకు ఆలౌట్ అయింది. రుతు, జలజ్‌తో పాటు విక్కీ ఓస్త్వాల్ (38), రామకృష్ణ ఘోష్ (31) రాణించడంతో ఈ మేర నామమాత్రపు స్కోరు సాధ్యమైంది. కేరళ బౌలర్లలో నిధీశ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నెడుమంకులి బాసిల్ మూడు, ఈడెన్ ఆపిల్, అంకిత్ శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: టీమిండియా సెలక్టర్లకు ఇషాన్ స్ట్రాంగ్ కౌంటర్.. అంతలోనే...
When they showed Jalaj Saxena's domestic stats one commentator said he has such great stats but it's surprising that he hasn't played for India and the other commentator replied
"Surprisingly" both of us were the selectors and you were the chairman. pic.twitter.com/QvtzZEbWkG https://t.co/q8kHY6rkkv— Aditya Soni (@imAdsoni) October 15, 2025