
విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన దేశం తరఫున టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో మరో విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు. ఈ ఇద్దరు టీ20ల్లో చెరో 12 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. వార్నర్ 110 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. మ్యాక్స్‌వెల్ 124 మ్యాచ్‌లో వార్నర్ రికార్డును సమం చేశాడు.
నిన్న (ఆగస్ట్ 16) సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో మెరుపు అర్ద శతకం బాది, తన జట్టును గెలిపించిన మ్యాక్సీ.. తన టీ20 కెరీర్‌లో 12వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓడిపోవాల్సిన ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. మ్యాక్సీ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.
తీవ్ర ఒత్తిడిలో మ్యాక్సీ ఆడిన ఈ ఇన్నింగ్స్ అతడి టీ20 కెరీర్‌లో అత్యుత్తమైందిగా చెప్పుకోవచ్చు. 173 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 88 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. ఈ దశలో బరిలోకి దిగిన మ్యాక్సీ కళ్లు మూసి తెరిచేలోపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తన జట్టును సేఫ్ జోన్‌లో ఉంచాడు. అంతేకాకుండా చివరి 2 బంతుల్లో 4 పరుగులు అవసమైన తరుణంలో ఊహించని షాట్ ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు.
ఈ ఇన్నింగ్స్‌లో 36 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్, రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలుపొందాయి.
బ్రెవిస్ విధ్వంసం
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదిన డెవాల్డ్ బ్రెవిస్ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగి ఆడాడు. 26 బంతుల్లో 6 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 53 పరుగులు చేశాడు. బ్రెవిస్ విధ్వంసానికి డస్సెన్ (38 నాటౌట్) మెరుపులు కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది.