
PC: MI
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఘనంగా సత్కరించింది. వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో రోహిత్ శర్మ పేరిట ఉన్న స్టాండ్‌ను శుక్రవారం ఆరంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్ శర్మ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్‌ను ఆవిష్కరించారు.
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
ఆ సమయంలో సీనియర్ నేత శరద్ పవార్, భారత జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్‌లతో పాటు హిట్‌మ్యాన్ సతీమణి రితికా సజ్దే కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘ఇక్కడి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.
అసలు ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ముంబైకి.. టీమిండియాకు ఆడాలని కలలు కంటూ పెరిగాను. దేశానికి నా వంతు సేవ చేయాలని భావించాను. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలు సాధించాను.
కఠిన సవాళ్లు ఎదుర్కొంటూ ఎన్నెన్నో మైలురాళ్లు అధిగమించాను. అయితే, వాటన్నింటికంటే ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. వాంఖడే వంటి ప్రసిద్ధ స్టేడియంలో నా పేరు ఇలా.. ఈ మైదానంతో నాకెన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి.
మాటల్లో వర్ణించలేను
ప్రపంచంలోని పేరెన్నికగన్న రాజకీయ నాయకులతో పాటు నా పేరు ఉండటం.. హో.. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఎంసీఏ సభ్యులు, యాజమాన్యానికి నేను కృతజ్ఞుడిని. నేను ఇంకా క్రికెటర్‌గా కొనసాగుతున్న సమయంలోనే ఇలాంటి గౌరవం దక్కడం ఎంతో ఎంతో ప్రత్యేకం.
రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాను. ఇంకో ఫార్మాట్ ఆడుతూనే ఉన్నాను. నిజంగా ఈ భావనను మాటల్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు. టీమిండియా తరఫున, ఐపీఎల్‌లో ముంబై తరఫున ఇక్కడికే వచ్చి మళ్లీ ఆడబోతున్నా. ఇంతకంటే గొప్పది నా జీవితంలో మరొకటి ఉండదు.
వారి త్యాగాలు మరువలేనివి
మా అమ్మానాన్న, నా భార్య, తమ్ముడు, మరదలు.. ఇలా కుటుంబమంతా ఇక్కడే ఉంది. వారందరి సమక్షంలో ఈ గౌరవం అందుకోవడం నాకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. నా కోసం వారంతా తమ జీవితంలోని చాలా సంతోషాలను త్యాగం చేశారు.
మా ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఇక్కడే ఉంది. నా ప్రసంగం ముగిసిన వెంటనే వాళ్లు మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెడతారు’’ అంటూ రోహిత్ శర్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు.
ఇక టీ20 ప్రపంచకప్-2024తో పాటు టీమిండియాకు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన ఘనత రోహిత్ సొంతం. తద్వారా మహేంద్ర సింగ్ ధోని (3) తర్వాత భారత్‌కు అత్యధిక (రెండు) ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా రికార్డు సాధించాడు.
ఇదిలా ఉంటే.. వాంఖడేలో ఇప్పటి వరకు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, వినోద్ మన్కడ్, దిలీప్ వెంగ్‌సర్కార్ పేరిట స్టాండ్స్ ఉన్నాయి. తాజాగా రోహిత్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.
చదవండి: ‘రోహిత్ జట్టులో లేకపోయినా నష్టమేమీ లేదు.. అది పెద్ద విషయమే కాదు’
𝗧𝗛𝗘 𝗥𝗢𝗛𝗜𝗧 𝗦𝗛𝗔𝗥𝗠𝗔 𝗦𝗧𝗔𝗡𝗗 🫡🏟#MumbaiIndians #PlayLikeMumbai #RohitSharmaStand | @ImRo45 pic.twitter.com/dqdWu6YSQ5
— Mumbai Indians (@mipaltan) May 16, 2025