
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ (Daryll Cullinan) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌కు రోహిత్ గొప్పగా చేసిందేమీ లేదని.. అతడు రిటైర్ అయినా టీమిండియాకు పెద్దగా నష్టం లేదని పేర్కొన్నాడు.
అదే విధంగా.. విరాట్ కోహ్లి (Virat Kohli) లేకపోయినా.. బౌలర్లు రాణిస్తే భారత్ ఇంగ్లండ్‌లో గట్టెక్కగలదని డారిల్ కలినన్ అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్‌లేమితో సతమతమవుతున్న రోహిత్ శర్మ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
న్యూజిలాండ్‌తో స్వదేశంలో 3-0తో రోహిత్ సేన వైట్‌వాష్ కావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకోవడంతో.. హిట్‌మ్యాన్‌పై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి తప్పుకొన్నా.. టెస్టుల్లో కొనసాగుతానని నాడు రోహిత్ స్పష్టం చేశాడు.
రో- కో లేకుండానే
ఈ క్రమంలో ఇంగ్లండ్ పర్యటనలో అతడే పగ్గాలు చేపడతాడనే వార్తలు రాగా.. అనూహ్యంగా మే 7న రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఆరురోజులు తిరిగే లోపే విరాట్ కోహ్లి కూడా సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫలితంగా.. వీరిద్దరు లేకుండా యువ భారత జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతోంది.
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి చాలా రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి అతడు సరైన నిర్ణయం తీసుకున్నాడు.
రోహిత్ లేకపోయినా నష్టమేమీ లేదు
నిజం చెప్పాలంటే.. టెస్టుల్లో రోహిత్ కెరీర్ అంత గొప్పగా ఏమీలేదు. సొంతగడ్డ మీదైనా.. విదేశాల్లోనైనా అదే తీరు. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సింది పోయి.. అతడే దారుణంగా విఫలమయ్యాడు. కాబట్టి రోహిత్ వీడ్కోలు పలకడం వల్ల భారత టెస్టు క్రికెట్‌కు వచ్చిన నష్టమేమీ లేదు’’ అని డారిల్ కలినన్ పేర్కొన్నాడు.
బౌలర్లంతా ఫిట్‌గా ఉంటే చాలు
ఇక ఇంగ్లండ్‌తో సిరీస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘టీమిండియా బౌలర్లందరూ ఫిట్‌గా ఉండి.. రాణించినట్లయితే ఇంగ్లండ్‌లో భారత్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి’’ అని కలినన్ అభిప్రాయపడ్డాడు.
విరాట్ కోహ్లి లేకపోయినా రాణించగల సత్తా టీమిండియాకు ఉందని పేర్కొన్నాడు. కాగా జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌తో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టే అవకాశం ఉంది.
కాగా 58 ఏళ్ల డారిల్ కలినన్ 1993 నుంచి 2001 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. సౌతాఫ్రికా తరఫున 70 టెస్టులు, 138 వన్డేలు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. సంప్రదాయ క్రికెట్‌లో 4554 పరుగులు, వన్డేల్లో 3860 రన్స్ సాధించాడు. మరోవైపు.. రోహిత్ శర్మ టీమిండియా తరఫున 67 టెస్టుల్లో 4301 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లి 123 టెస్టులాడి 9230 రన్స్ సాధించాడు.
చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్