
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అదరగొడుతోంది. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) సారథ్యంలో ఇప్పటికే ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోతున్న ఆర్సీబీ... ఈసారైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఒకవేళ అదే జరిగితే పాటిదార్ బెంగళూరు జట్టుకు తొలి ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కుతాడు.
మెగా వేలంలో నన్ను కొనలేదు
అయితే, ఒకప్పుడు తనకు జట్టులో చోటే ఇవ్వని ఆర్సీబీకి తిరిగి రావొద్దని పాటిదార్ అనుకున్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు నాకు ఫ్రాంఛైజీ నుంచి కాల్ వచ్చింది.
మేము నిన్ను తీసుకోబోతున్నాము సిద్ధంగా ఉండు అని చెప్పారు. నేను మరోసారి ఆర్సీబీకి ఆడబోతున్నానని ఎంతో సంతోషపడ్డాను. కానీ మెగా వేలంలో వాళ్లు నన్ను కొనలేదు.
దీంతో నేను స్థానిక మ్యాచ్‌లలో ఆడుతూ కాలం గడిపాను. అప్పుడు అకస్మాత్తుగా ఆర్సీబీ నుంచి మరోసారి ఫోన్‌కాల్ వచ్చింది. గాయపడిన లవ్‌నిత్ సిసోడియా స్థానంలో నిన్ను జట్టులోకి తీసుకుంటున్నాం అని చెప్పారు.
తిరిగి ఆర్సీబీకి వెళ్లాలని అనుకోలేదు
కానీ నిజం చెప్పాలంటే.. నాకు అప్పుడు తిరిగి ఆర్సీబీకి వెళ్లాలని అనిపించలేదు. ఎందుకంటే.. ఇంజూరీ రీప్లేస్‌మెంట్‌గా వెళ్తే నాకు ఆడే అవకాశం రానేరాదు. డగౌట్‌లో ఉత్తినే కూర్చోవడం నాకసలు ఇష్టం లేదు.
వేలంలో నన్ను కొననందుకు కోపం వచ్చిందని చెప్పను గానీ.. తీవ్ర నిరాశకు గురయ్యాను. కానీ గాయపడిన ఆటగాడి స్థానంలో వెళ్లినా నాకైతే ఆడే ఛాన్స్ ఇవ్వరు. అందుకు కోపం వచ్చింది. అయితే, అది కూడా కాసేపే... ఆ తర్వాత నేను మళ్లీ సాధారణ స్థితికి వచ్చేశాను’’ అని రజత్ పాటిదార్ ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో గత జ్ఞాపకాలు పంచుకున్నాడు.
కోహ్లినే కీలకం.. సూచనలు, సలహాలు
అదే విధంగా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టడం కొత్తగా అనిపించిందన్న పాటిదార్.. ‘‘సారథిగా నా పేరును ప్రకటించగానే ఎన్నో సందేహాలు చుట్టుముట్టాయి. జట్టులో విరాట్ కోహ్లి వంటి దిగ్గజ ఆటగాడు ఉన్నాడు. ఆయన నా కెప్టెన్సీలో ఆడటమా? అని సందేహించాను.
అయితే, కెప్టెన్సీ మార్పు విషయంలో కోహ్లి పూర్తి మద్దతుగా నిలబడ్డాడు. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అనుభవజ్ఞుడైన కోహ్లి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విజయవంతమయ్యేందుకు కోహ్లి నాకెన్నో సూచనలు ఇచ్చాడు’’ అని కోహ్లితో తన అనుబంధాన్ని వివరించాడు.
కాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఎనిమిది గెలిచింది. తద్వారా 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా ఒకప్పుడు జట్టులో చోటే దక్కించుకోలేని రజత్ పాటిదార్.. ఈసారి ఏకంగా కెప్టెన్‌గా నియమితుడు కావడంతో పాటు సారథిగా అదరగొడుతుండటం విశేషం. ఈ సీజన్‌లో ఇప్పటికి అతడు 239 పరుగులు సాధించాడు.
చదవండి: IPL 2025 Resumption: ఆసక్తి రేపుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడి పోస్ట్