
Photo Courtesy: BCCI
ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాత్కాలిక రీప్లేస్‌మెంట్ల కోసం వెతుకుతున్న వేల, టీమిండియా ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ పృథ్వీ షా పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఈ సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని షా.. "బ్రేక్ కావాలంటూ" ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు షా రీప్లేస్‌మెంట్ ఆటగాడిగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.
2018లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల షా.. ఐపీఎల్‌లో డీసెంట్ రికార్డు (79 మ్యాచ్‌ల్లో 147.467 స్ట్రయిక్‌రేట్‌తో 1892 పరుగులు) కలిగి ఉన్నాడు. అయితే వ్యక్తిగత అలవాట్లు, ఫిట్‌నెస్ కోల్పోవడం అతన్ని ఐపీఎల్ పాటు దేశవాలీ క్రికెట్‌కు దూరం చేశాయి. గత సీజన్‌లో ఢిల్లీకి ఆడిన షా.. 8 మ్యాచ్‌ల్లో 163.63 స్ట్రయిక్‌రేట్‌తో 198 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ సేవలు కోల్పోవడంతో షా ఆ జట్టులో చోటు ఆశిస్తున్నాడు.
ప్రస్తుత తరుణంలో షాకు ఢిల్లీ అవకాశం ఇవ్వకపోయినా ముంబై ఇండియన్స్ ఛాన్స్ ఇవ్వొచ్చన్న టాక్ నడుస్తుంది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకు దేశీయ బ్యాటర్ కోసం చూస్తుందని సమచారం.
ఒకప్పుడు టీమిండియా భవిష్యత్తుగా కీర్తించబడ్డ పృథ్వీ షా ఇప్పుడు ఐపీఎల్‌లో ఛాన్స్ కోసం వెంపర్లాడటం ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా ఇలాంటి గతే పడుతుందని జనాలు అంటున్నారు. పృథ్వీ షాలా కావొద్దని ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్న యువ ఆటగాళ్లకు సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే, భారత్-పాకిస్తాన్ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్ 2025 మే 17 నుంచి పునఃప్రారంభం కానుంది. యుద్దం నేపథ్యంలో స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ క్రికెటర్లు జాతీయ జట్ల అవసరాల దృష్ట్యా ఐపీఎల్ తదుపరి లెగ్‌లో పాల్గొనలేకపోతున్నారు.
కొందరు ఇతరత్రా కారణాల చేత ఐపీఎల్‌లో కొనసాగేందుకు విముఖత చూపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ తిరిగి రాని ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలోనే పృథ్వీ షా లాంటి చాలా మంది భారత ఆటగాళ్లు ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.