
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ‘రన్‌మెషీన్’ తన వృత్తిగత జీవితంలో అన్నీ సాధించేశాడని.. అయితే, పదిహేడేళ్లుగా ఓ లోటు మాత్రం అలాగే మిగిలిపోయిందన్నాడు. ఇంతకీ అదేమిటంటే..!?
కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ విషయంలోనూ రోహిత్‌నే అనుసరించాడు.
రోహిత్ సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వారంలోపే తానూ టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు కోహ్లి వెల్లడించాడు. ఇక ఇప్పటికే ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్ లీగ్ ఐపీఎల్‌లో కొనసాగుతున్న వీరిద్దరు.. భారత్ తరఫున వన్డేల్లోనూ కొనసాగనున్నారు.
ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్
కాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. అంతకు ముందు దక్కన్ చార్జర్స్ ఆటగాడిగానూ ట్రోఫీ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. అయితే, క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచీ అంటే 2008 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తోనే ఉన్న కోహ్లికి ఇంత వరకు ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
చిరకాల కల నెరవేరేనా?
ఈసారి మాత్రం కోహ్లి చిరకాల కల నిజమయ్యేలా కనిపిస్తోంది. ఐపీఎల్-2025లో వరుస విజయాలతో జోరు మీదున్న పాటిదార్ సేన చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లుగానే ఆర్సీబీ ఈసారి ఇప్పటికే పదకొండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
ఇక ఐపీఎల్-2025 పునఃప్రారంభం నేపథ్యంలో శనివారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లి మైదానంలో దిగబోతున్నాడు.
కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటు
ఒకవేళ ఆర్సీబీ గనుక ఈసారి ట్రోఫీ గెలిస్తే అతడి సంతోషానికి అవధులు ఉండవు. ఆర్సీబీకి వెన్నెముక, ప్రధాన బలం అతడే. తన జీవితంలో అన్నీ ఉన్నాయి.. అయితే, ఆర్సీబీ ట్రోఫీ గెలవకపోవడం మాత్రమే లోటు.
ఆర్సీబీకి టైటిల్ అందించేందుకు అతడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఈసారి ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడుతుందనే అనుకుంటున్నా. విరాట్ కోహ్లి బ్యాట్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ జాలువారితే అదేమీ పెద్ద కష్టం కాబోదు’’ అని పేర్కొన్నాడు.
అదే విధంగా.. కోహ్లితో పాటు మిగిలిన పది మంది కూడా రాణిస్తేనే ఇది సాధ్యమవుతుందని రైనా చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. 505 పరుగులు సాధించి.. ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.
ఆరెంజ్ క్యాప్ పోటీలో సూర్యకుమార్ యాదవ్ (510), సాయి సుదర్శన్ (509), శుబ్‌మన్ గిల్ (508)లతో కోహ్లి పోటీపడుతున్నాడు. కాగా ఆర్సీబీ- కేకేఆర్ మధ్య మే 17 నాటి మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక అన్న సంగతి తెలిసిందే.
చదవండి: బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్: టీమిండియా మాజీ కోచ్