
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ అంశంపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయం పంచుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సారథిగా నియమించకూడదని యాజమాన్యానికి సూచించాడు. పేస్ దళ నాయకుడికి బదులు యువ ఆటగాడికి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందంటూ ఇద్దరు స్టార్ల పేర్లు చెప్పాడు.
దిగ్గజాల వీడ్కోలు
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్ భారత్- ఇంగ్లండ్ సిరీస్‌తో మొదలుకానున్న విషయం తెలిసిందే. స్టోక్స్ బృందంతో ఐదు టెస్టుల్లో తలపడేందుకు టీమిండియా అక్కడకు వెళ్లనుంది. అయితే, ఈ కీలక పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇక దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో భారత జట్టు కొత్త కెప్టెన్, నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేసే ఆటగాడు ఎవరన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో భాగంగా ప్రజెంటర్, బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌తో రవిశాస్త్రి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
బుమ్రానే ఫస్ట్ చాయిస్.. కానీ వద్దే వద్దు
‘‘నా వరకైతే.. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కచ్చితంగా జస్‌ప్రీత్ బుమ్రానే కెప్టెన్‌గా ప్రథమ ప్రాధాన్యం ఇవ్వగలిగే ఆటగాడు. అయితే, నేను జస్‌ప్రీత్ సారథి కావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే.. కెప్టెన్‌గా ఉంటే అతడిపై అదనపు భారం పడుతుంది.
బౌలర్‌గానూ బుమ్రా సేవలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అతడు తన శరీరాన్ని మరీ ఎక్కువగా కష్టపెట్టకూడదు. తీవ్రమైన వెన్నునొప్పి తర్వాత ఇటీవలే బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్ ఆడుతున్నాడు.
ఒత్తిడికి లోనయ్యే అవకాశం
అయితే, అక్కడ కేవలం నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా మాత్రమే ఉంటుంది. కానీ టెస్టుల్లో 10- 15 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఇలా బౌలర్‌గా, కెప్టెన్‌గా అదనపు భారం పడితే అతడు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ఆ ఇద్దరిలో ఒకరు బెటర్
ఇక యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందంటూ.. ‘‘కెప్టెన్‌గా శుబ్‌మన్ సరైన వాడు అనిపిస్తోంది. అతడికి అవకాశం ఇస్తే బాగుంటుంది. అతడి వయసు 25- 26 ఏళ్ల మధ్య ఉంటుంది. సారథిగా తనను తాను నిరూపించుకుంటే.. దీర్ఘకాలం కొనసాగల సత్తా అతడికి ఉంది.
రిషభ్ పంత్‌ను పక్కన పెట్టే వీలు లేదు. నా దృష్టిలో టీమిండియా టెస్టు కొత్త కెప్టెన్లుగా వీరిద్దరిలో ఒకరే అత్యుత్తమ ఎంపిక. మరో దశాబ్దకాలం పాటు టీమిండియాకు ఆడగలరు.
ఇప్పటికే ఇద్దరూ ఐపీఎల్‌లో జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి ఆ అనుభవం కూడా పనికివస్తుంది. అందుకే గిల్, పంత్‌లలో ఒకరికి టీమిండియా కెప్టెన్‌గా అవకాశం ఇస్తే బాగుంటుంది’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గా జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది.
కాగా గతంలో ఇంగ్లండ్ పర్యటనలో ఓసారి భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పెర్త్, సిడ్నీ టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించాడు. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో పెర్త్‌లో మాత్రమే గెలిచిన భారత జట్టు.. 1-3తో ట్రోఫీని చేజార్చుకుంది.
చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!