
కెయిర్న్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
ప్రోటీస్ ఓపెనర్లు ఐడైన్ మార్‌క్రమ్(1), రికెల్టన్ త్వరగా ఔటైనప్పటికి మిడిలార్డర్‌లో డెవాల్డ్ బ్రెవిస్ మరోసారి మెరుపులు మెరిపించాడు. కాజాలి స్టేడియంలో బ్రెవిస్ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బ్రెవిస్.. 6 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 53 పరుగులు చేశాడు. అతడితో పాటు వండర్ డస్సెన్(38), స్టబ్స్(25) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఈల్లీస్ మూడు, జంపా, హాజిల్ వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
మ్యాక్స్‌వెల్ మెరుపులు..
అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ తొలి వికెట్‌కు 66 పరుగులు అందించారు. అయితే సఫారీ బౌలర్లు అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇవ్వడంతో ఆసీస్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో గ్లెన్ మాక్స్‌వెల్ విరోచిత పోరాటం కనబరిచాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగి తమ జట్టుకు సిరీస్ విజయాన్ని అందించాడు. మాక్స్ 36 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు కెప్టెన్ మిచెల్ మార్ష్(54) సూపర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రోటీస్ బౌలర్లలో కార్బిన్ బాష్ మూడు వికెట్లు పడగొట్టగా.. రబాడ, మఫాక తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: రిషబ్ పంత్ గాయం ఎఫెక్ట్.. సరికొత్త రూల్‌ను తీసుకురానున్న బీసీసీఐ!