
మెక్‌కే వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు భీబత్సం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 431 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్ విధ్వంసక శతకాలతో కదం తొక్కారు. తొలుత మార్ష్, హెడ్ సౌతాఫ్రికా బౌలర్లను ఉతికారేశారు. వారిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 250 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హెడ్ కేవలం 103 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 142 పరుగులు చేయగా.. మార్ష్ 106 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆ తర్వాత గ్రీన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గ్రీన్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచే సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి విధ్వంసం ధాటికి బౌండరీలు చిన్నబోయాయి. గ్రీన్ మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
ఈ ముగ్గురు సెంచరీల హీరీలతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(50) ఆర్ధశతకంతో రాణించాడు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, ముత్తసామి తలా వికెట్లు సాధించారు. ఫాస్ట్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. వియాన్ ముల్డర్ అయితే 7 ఓవర్లు బౌలింగ్ చేసి 93 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా ఇప్పటికే సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ కోల్పోయింది. ఇది కేవలం నామమాత్రపు మ్యాచ్ మాత్రమే. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కసితో ఆసీస్ ఉంది.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా లెజెండ్..