ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్.. యాషెస్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. పెర్త్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో హెడ్ భారీ శతకంతో చెలరేగాడు. అనూహ్య స్వింగ్, ఊహించని బౌన్స్‌తో బ్యాటింగ్‌కు పరీక్షగా మారిన పిచ్‌పై ఇంగ్లండ్ జట్టు 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంతో... ఆసీస్‌కు ఛేదన కష్టమే అనిపించింది.
తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడిన కంగారూ జట్టుకు యాషెస్ సిరీస్ తొలి మ్యాచ్‌లో పరాజయం తప్పకపోవచ్చనే అంచనాల మధ్య హెడ్ అదరగొట్టాడు. గాయంతో ఇబ్బంది పడుతున్న ఉస్మాన్ ఖ్వాజా స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన హెడ్... పక్కా టీ20 ఆటతీరుతో అదరగొట్టాడు. గత కొన్నాళ్లుగా ‘బాజ్‌బాల్’ ఆటతీరుతో వేగంగా పరుగులు రాబడుతూ ప్రత్యర్థులను భయపెడుతున్న ఇంగ్లండ్ జట్టును తన ట్రేడ్‌మార్క్ హిట్టింగ్‌తో ఓ ఆటాడుకున్నాడు.
బంతి ఎక్కడపడ్డా దాని గమ్యం బౌండరీనే అన్న చందంగా భారీ షాట్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 36 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్... 69 బంతుల్లో శతకం తన పేరిట లిఖించుకున్నాడు.
మిగతా ఆటగాళ్లంతా పరుగులు తీసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చోట... హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఎడాపెడా బౌండరీలు బాదుతూ లక్ష్యాన్ని కరిగించాడు. ఫలితంగా లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 28.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది.
ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన హెడ్‌పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. "ట్రావిస్ హెడ్... రెండు సంవత్సరాల క్రితం నువ్వు నా దేశం మొత్తాన్ని మౌనంలోకి నెట్టావు. ఇప్పుడు మళ్లీ అదే పనిచేశావు. కానీ ఈసారి జట్టు మారింది. క్రికెట్‌లోనే అత్యుత్తమ ఫార్మాట్(టెస్టు)లో నీవు ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికి గుర్తుండుపోతుంది.
నిజంగా అతడి బ్యాటింగ్‌కు పిధా అయిపోయాను. ఇంగ్లండ్‌కు ఇదొక పీడకలలా మిగిలిపోతుంది" అని ఎక్స్‌లో శాస్త్రి రాసుకొచ్చాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో భారత్‌పై హెడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తను తుపాన్ ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి మొట్టుపై టీమిండియా బోల్తా పడింది.


