రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా లెజెండ్‌.. | Cheteshwar Pujara retires from all forms of Indian cricket | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా లెజెండ్‌..

Aug 24 2025 11:35 AM | Updated on Aug 24 2025 1:04 PM

Cheteshwar Pujara retires from all forms of Indian cricket

భార‌త క్రికెట్‌లో మ‌రో శ‌కం ముగిసింది. టీమిండియా దిగ్గజం చతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఈ సీనియ‌ర్ బ్యాట‌ర్ త‌న నిర్ణ‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆదివారం వెల్ల‌డించాడు. "భార‌త జెర్సీ ధ‌రించి ప్ర‌తీ మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం అల‌పించడం నాకు ద‌క్కిన అరుదైన గౌర‌వంగా భావిస్తున్నాను. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ నా శాయశక్తులా ప్రయత్నించాను.

నా ఈ అద్బుత ప్ర‌య‌ణాన్ని మాటల్లో వ‌ర్ణించ‌లేను. కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి విషయాలకు ముగింపు పలకాల్సిందే. కాబ‌ట్టి ఈ రోజు భార‌త క్రికెట్‌కు సంబంధించి అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి కావాలని నిర్ణయించుకున్నాను. నా క్రికెట్ కెరీర్‌లో మ‌ద్దతుగా నిలిచిన బీసీసీఐ,  సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

అభిమానుల ప్రేమాభిమానాల‌కు నేను ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను. అదేవిధంగా నేను ప్రాతినిథ్యం వ‌హించిన ఫ్రాంచైజీ క్రికెట్ జ‌ట్ల‌ యాజ‌మాన్యాల‌కు,  కౌంటీ క్రికెట్ క్ల‌బ్స్‌, నా స‌హాచరులకు, కోచ్‌ల‌కు, స‌పోర్ట్ స్టాప్‌ల‌కు, నెట్ బౌల‌ర్ల‌కు కూడా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను. రాజ్‌కోట్‌ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన తనకు భారత క్రికెట్‌ ఎంతో ఇచ్చిందని అని తన రిటైర్మెంట్‌ నోట్‌లో చతేశ్వర్ రాసుకొచ్చాడు.

ఆసీస్‌పై అరంగేట్రం..
టీమిండియా దిగ్గజం రాహుల్ ద్ర‌విడ్ (Rahul Dravid) వార‌సుడిగా పేరొందిన‌ ఛ‌తేశ్వ‌ర్ పుజారా.. అక్టోబర్ 9, 2010న భారత తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాపై త‌న టెస్టు అరంగేట్రం చేశాడు. త‌న కెరీర్‌లో 103 టెస్టులు ఆడిన పుజ‌రా  43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు.  అందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ఈ సౌరాష్ట్ర ఆట‌గాడు భార‌త త‌ర‌పున టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఎనిమిదో ఆట‌గాడిగా కొనసాగుతున్నాడు. పూజారా త‌న ఆసాద‌ర‌ణ బ్యాటింగ్‌తో టీమిండియా న‌యావాల్‌గా పేరు గాంచాడు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు భార‌త టెస్టు జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా పూజారా కొన‌సాగాడు. మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు అడ్డుగోడలా నిలిచేవాడు. ఆ తర్వాత అతడి ఫామ్‌ కోల్పోవడంలో భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు.

పూజారా చివరిసారిగా భారత్‌ తరఫున 2023లో ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ ఆడాడు. కాగా 2013లో ఫార్మాట్‌లో డెబ్యూ చేసిన పూజారా కేవ‌లం  5 వన్డేల్లో మాత్రమే ఆడాడు. ఆ ఐదు మ్యాచ్‌లలో అతడు 51 పరుగులు చేశాడు. 

ఆసీస్ గ‌డ్డ‌పై అదుర్స్‌..
2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై జ‌రిగిన‌ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పుజారా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు. ఆ సిరీస్‌లో మొత్తం 521 పరుగులు చేసి, టీమిండియా  తొలిసారిగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

రంజీల్లో రారాజు
ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో పుజారాకు అద్బుతమైన ట్రాక్‌ రికార్డు ఉంది. 278 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 66 సెంచరీలు, 81 హాఫ్‌ సెంచరీలతో 21301 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌ కౌంటీల్లో కూడా చాలా సీజన్లు పుజారా ఆడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement