చరిత్ర సృష్టించిన ఆసీస్‌.. 148 ఏళ్ల క్రికెట్‌ హిస్టరీలోనే | Australia Record Breaking Win In Ashes Opener With Fastest 200+ Run Chase In Test History | Sakshi
Sakshi News home page

AUS vs ENG: చరిత్ర సృష్టించిన ఆసీస్‌.. 148 ఏళ్ల క్రికెట్‌ హిస్టరీలోనే

Nov 23 2025 8:45 AM | Updated on Nov 23 2025 11:17 AM

Australia Create History After Crushing England

ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఆ్రస్టేలియా శుభారంభం చేసింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్‌ జట్టు 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది. ట్రావిస్‌ హెడ్‌ (83 బంతుల్లో 123; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసక సెంచరీతో జట్టుకు ఒంటి చేత్తో విజయం కట్టబెట్టాడు.

పేసర్ల హవా సాగిన పెర్త్‌ టెస్టులో రెండు రోజుల్లోనే ఫలితం తేలగా... ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆ్రస్టేలియా 1–0తో ముందంజ వేసింది. 205 పరుగుల లక్ష్యఛేదనలో ఆ్రస్టేలియా జట్టు 28.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. హెడ్‌ శతకంతో కదం తొక్కగా... మార్నస్‌ లబుషేన్‌ (49 బంతుల్లో 51 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అతడికి అండగా నిలిచాడు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 123/9తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ్రస్టేలియా మరో 3 పరుగులు చేసి 132 వద్ద ఆలౌటైంది. దీంతో 46 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కించుకున్న ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో విఫలమైంది. 34.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. 

అట్కిన్సన్‌ (32 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒలీ పోప్‌ (57 బంతుల్లో 33; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆసీస్‌ బౌలర్లలో స్కాట్‌ బోలాండ్‌ 4 వికెట్లు పడగొట్టగా... మిచెల్‌ స్టార్క్, డగెట్‌ చెరో 3 వికెట్లు తీశారు. స్టార్క్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య డిసెంబర్‌ 4 నుంచి బ్రిస్బేన్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది.  ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన కంగారుల జట్టు ఓ వరల్డ్ రికార్డు తమ ఖాతాలో వేసుకుంది.

చరిత్ర సృష్టించిన ఆసీస్‌..
148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా రెండు వందల పరుగుల పైగా లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ టార్గెట్‌ను కేవలం 28.2 ఓవర్లలోనే ఊదిపడేసింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండేది. ఇంగ్లండ్  204 పరుగుల లక్ష్యాన్ని 35.3 ఓవర్లలో ఛేదించింది. తాజా విజయంతో ఇంగ్లండ్ ఆల్‌టైమ్ రి​కార్డు ఆసీస్ బ్రేక్ చేసింది. 
చదవండి: కెప్టెన్‌గా సంజూ శాంస‌న్‌.. అధికారిక ప్ర‌కట‌న‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement