
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) దేశవాళీ క్రికెట్ సీజన్ 2025-26లో 'సీరియస్ ఇంజురీ రీప్లేస్‌మెంట్'సరికొత్త రూల్‌ను పరిచయం చేయనుంది. ఈ రూల్ ప్రకారం ఏ ప్లేయరైనా తీవ్రంగా గాయపడితే అతడి స్ధానంలో 'లైక్ ఫర్ లైక్ రీప్లేస్‌మెంట్’ మరొకరిని తీసుకోవచ్చు.
అంటే ఉదహరణకు బౌలర్ గాయపడితే బౌలర్, బ్యాటర్ గాయపడితే బ్యాటర్‌ను భర్తీ చెయోచ్చు. టాస్ వేసే ముందు ఆయా జట్లు నలుగురు ఆటగాళ్లతో కూడిన జాబితాను అంపైర్‌లకు అందజేయాలి. ఎవరైనా గాయపడితే వారి నుంచే భర్తీ చేయాలి. ప్రస్తుతానికి ఈ రూల్ సీకే నాయుడు ట్రోఫీలో వర్తించనుంది.
అహ్మదాబాద్‌లో జరుగుతున్న సెమినార్‌లో అంపైర్లకు ఈ మార్పు గురించి తెలియజేసేందుకు బీసీసీఐ ఒక ప్రత్యేక సెషన్‌ను నిర్వహించింది. అయితే ఈ ఏడాది జరగనున్న సయ్యద్ ముష్తాక్ అలీ లేదా విజయ్ హజారే ట్రోఫీలో బోర్డు ఈ ప్రవేశ పెట్టకపోవచ్చు.
ఐపీఎల్-2026, రంజీ ట్రోఫీ సీజన్‌లో ఈ కొత్త నియమాన్ని అమలు చేసే అవకాశముంది. అయితే గాయం తీవ్రతను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాత ఆటగాడిని రిప్లేస్ చేయాలా వద్దా అని నిర్ణయించే తుది అధికారం మ్యాచ్ రిఫరీదేనని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు.
కాగా ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ కొత్త రూల్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్‌లో పంత్ కాలు ఎముక విరిగిన కూడా బ్యాట్‌కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం కంకషన్ సబ్‌స్ట్యూట్(తలకు దెబ్బ)కు మాత్రమే రిప్లేస్‌మెంట్ అవకాశముంది.
చదవండి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు జీతాలు కట్!?