
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఫార్మాట్‌తో సంబంధం లేకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన పాకిస్తాన్ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. అదేవిధంగా ఇప్పటివరకు ఆడిన 11 వన్డేల్లో పాక్ తొమ్మిదింట ఓటమి పాలైంది.
టీ20ల్లో మెన్ ఇన్ గ్రీన్ కాస్త ఫర్వాలేదన్పించింది. 14 మ్యాచ్‌లు ఆడి ఏడింట గెలుపొందింది. అయితే పాక్ జట్టు ప్రదర్శన పట్ల ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెట్ పాకిస్తాన్ రిపోర్ట్ ప్రకారం.. ఆటగాళ్లు తీసుకునే జీతాలపై పీసీబీ కోతకు సిద్దమైనట్లు సమాచారం.
కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఆటగాళ్లకు ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూలో మూడు శాతం వాటాను బోనస్‌గా ఇస్తోంది. వచ్చే ఏడాది నుంచి మూడు శాతం వాటాపై కోత విధించాలని పీసీబీ భావిస్తుందంట.
కాగా రెండేళ్ల క్రితం కొంతమంది సీనియర్ ఆటగాళ్లు ఐసీసీ ఆదాయంలో తమకు వాటా ఇవ్వాలని పీసీబీపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే మూడు శాతం వాటాను ఆటగాళ్లకు ఇస్తూ పీసీబీ వచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా జట్టు పరిస్థితి దిగజారిపోవడంతో పీసీబీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు సిద్దమైంది. అంతేకాకుండా ఇప్పటిలో ఆటగాళ్ల జీతాలను కూడా పెంచే యోచనలో పీసీబీ లేనట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ ఆటగాళ్ల జీతాలు ఎంతంటే?
అయితే ప్రస్తుతం పీసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీ-ఎలో ఉన్న ఆటగాళ్లకు పాకిస్తాన్ కరెన్సీలో 4.5 మిలియన్లు లభించంనుంది. అంటే భారత కరెన్సీలో సంవత్సరానికి దాదాపు కోటిన్నర రూపాయల వరకు దక్కనుంది. అదేవిధంగా ఐసీసీ వాటా నుంచి 2.07 మిలియన్లు లభిస్తాయి.
మొత్తంగా ఏ-గ్రేడ్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.2 కోట్ల పైగా అందనుంది. కేటగిరీ బీలో ఉన్న ఆటగాళ్లకు ఐసీసీ వాటా నుంచి 3 మిలియన్లు, పీసీబీ నుంచి 1.5 మిలియన్లు లభిస్తాయి. మొత్తంగా ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు భారత కరెన్సీ ప్రకారం రూ.13 కోట్లపైగా దక్కనుంది. కేటగిరి సీ లోని ఆటగాళ్లకు మొత్తంగా 7 లక్షలు లభించనుంది.