
దుబాయ్: వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అండర్–19 పురుషుల ప్రపంచకప్‌నకు అమెరికా జట్టు అర్హత సాధించింది. జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నమెంట్‌కు అమెరికా... చివరిదైన 16వ జట్టుగా ఎంపికైంది. ఇటీవలి కాలంలో సీనియర్ స్థాయిలో చక్కటి ప్రదర్శన కనబరుస్తూ అందరి ప్రశంసలు దక్కించుకుంటున్న అమెరికా... ఇప్పుడు జూనియర్ స్థాయిలోనూ సంచలనాలు రేపేందుకు సిద్ధమైంది.
2024లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్–19 ప్రపంచకప్‌లో పాల్గొన్న టాప్–10 జట్లు నేరుగా ఈ సారి బరిలోకి దిగనుండగా... ఆతిథ్య హోదాలో జింబాబ్వే వరల్డ్‌కప్ ఆడనుంది. మిగిలిన ఐదు జట్లను వేర్వేరు క్వాలిఫయింగ్ ఈవెంట్‌ల ద్వారా ఎంపిక చేశారు. తాజాగా అమెరికా అర్హత టోర్నీలో అదరగొట్టింది. బెర్ముడా, అర్జెంటీనా, కెనడాపై విజయాలు సాధించి... మరో మ్యాచ్ మిగిలుండగానే వరల్డ్‌కప్ బెర్త్ పట్టేసింది.
జార్జియా వేదికగా డబుల్ రౌండ్‌రాబిన్ పద్ధతిలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో అర్జున్ మహేశ్ సారథ్యంలోని అమెరికా జట్టు చివరి మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో కెనడాపై విజయం సాధించింది. తద్వారా ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది.
2026 అండర్–19 పురుషుల ప్రపంచకప్‌లో పాల్గొననున్న జట్లు
జింబాబ్వే, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, భారత్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్, జపాన్, స్కాట్లాండ్, టాంజానియా, అమెరికా.