
కైర్న్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు బ్రెవిస్ చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఆసీస్ బౌలర్ ఆరోన్ హార్దీని బ్రెవిస్ ఉతికారేశాడు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన హార్దీ బౌలింగ్‌లో బ్రెవిస్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బ్రెవిస్.. 6 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 53 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బ్రెవిస్ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.
విరాట్ కోహ్లి రికార్డు బద్దలు..
టీ20 చరిత్రలో ఆస్ట్రేలియాపై వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా బ్రెవిస్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయాడు. అదేవిధంగా ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ జట్టుపై టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా బ్రెవిస్ చరిత్ర సృష్టించాడు.
బ్రెవిస్ ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై మూడు టీ20లు ఆడి 14 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి ఆస్ట్రేలియాలో మెన్ ఇన్ ఎల్లోపై 11 మ్యాచ్‌లు ఆడి 12 సిక్స్‌లు బాదాడు.
తాజా మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు బాదిన బ్రెవిస్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో శిఖర్ ధావన్(9) ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్రెవిస్(180) టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఆఖరి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2తో ఆస్ట్రేలియాకు కోల్పోయింది.