పాకిస్తాన్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ భుజం కండరాల నొప్పి కారణంగా పాక్‌తో మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. బ్రెవిస్ ప్రస్తుతం తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే బ్రెవిస్‌కు ప్రత్నమ్నాయంగా మరోక ఆటగాడిని జట్టులోకి సెలక్టర్లు తీసుకోలేదు. అతడి స్దానాన్ని మరొకరితో సెలక్టర్లు భర్తీ చేయలేదు. జూనియర్ ఏబీడీ తన స్వదేశానికి వెళ్లకుండా ప్రస్తుతం జట్టుతో పాటు పాక్‌లో ఉన్నాడు.
భారత పర్యటనకు ముందు బ్రెవిస్ తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని ఆశిస్తుంది. సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మరో వారం రోజుల్లో భారత్ టూర్‌కు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రోటీస్ ఆతిథ్య జట్టుతో రెండు టెస్టు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది.
ఈ మూడు ఫార్మాట్ల సిరీస్‌కు ఎంపిక చేసిన సౌతాఫ్రికా జట్టులో బ్రెవిస్ భాగంగా ఉన్నాడు. నవంబర్ 14 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సమయానికి బ్రెవిస్ కోలుకోపోతే అది సఫారీలకు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. బ్రెవిస్ విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు.
ఫార్మాట్ ఏదైనా తన ఆట తీరు ఏ మాత్రం మారదు. అయితే పాక్ పర్యటనలో మాత్రం బ్రెవిస్ విఫలమయ్యాడు. తొలుత టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం 54 పరుగులు మాత్రమే చేసిన బ్రెవిస్.. ఆ తర్వాత టీ20 సిరీస్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే బ్రెవిస్ లాంటి ఆటగాడు తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడు.
చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. వణికి పోయిన బౌలర్లు


