
ముంబై: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇటీవలే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేలు, టి20ల్లో అద్భుత ప్రదర్శనతో ఎన్నో గొప్పరికార్డులు సాధించిన రోహిత్... టెస్టుల్లో అలాంటి ప్రభావం చూపలేకపోయాడు. పడుతూ, లేస్తూ సాగిన కెరీర్‌లో 67 టెస్టులు ఆడిన అతను 4301 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
తాజాగా.. టెస్టు క్రికెట్ (Test Cricket) అంత సులువు కాదని, అది ప్రతీ ఆటగాడికి సవాల్ విసురుతుందని రోహిత్ వ్యాఖ్యానించాడు. దాని కోసం సన్నద్ధత కూడా చాలా కఠోరంగా ఉంటుందని అతను అభిప్రాయపడ్డాడు.
ఇది పెద్ద సవాల్
‘టెస్టుల కోసం సన్నద్ధత చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ఫార్మాట్‌లో ఎక్కువ సేపు మైదానంలో గడపాల్సి ఉంటుంది. ఐదు రోజుల పాటు ఆటలో ఉండాలంటే అంత సులువు కాదు. శారీరకంగా ఎంతో అలసిపోవడమే కాదు, మానసికంగా కూడా ఇది పెద్ద సవాల్ విసురుతుంది. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎక్కువగా ఆడటం వల్ల దీనికి అలవాటు పడతారు.
మేం ముంబైలో పోటీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన సమయంలో రెండు లేదా మూడు రోజుల మ్యాచ్‌లు జరిగేవి. దానికి అనుగుణంగా మా శరీరాలను సిద్ధం చేసేవాళ్లం. కఠిన పరిస్థితులు ఎదురైనా దీని వల్ల పని కాస్త సులువవుతుంది’ అని సియెట్ టైర్ సంస్థ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రోహిత్ అన్నాడు.
ప్రాక్టీస్‌తో క్రమశిక్షణ...
యువ ఆటగాళ్లు తమ కెరీర్ ఆరంభంలో ఈ సన్నద్ధతపై దృష్టి పెట్టరని, అయితే దాని ప్రాధాన్యత ఏమిటో తర్వాతి రోజుల్లో తెలుసు కుంటారని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ‘నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన రోజుల్లో అంతా సరదాగా ఉండేది. వినోదం కోసమే ఆడేవాళ్లం.
అయితే వివిధ వయోవిభాగాల్లో ఆడటం మొదలు పెట్టి ముందుకు వెళుతుంటే పరిస్థితి మారిపోతుంది. ఎంతో మంది సీనియర్లు, కోచ్‌లకు ప్రాక్టీస్ ప్రాధాన్యత ఏమిటో మీకు వివరిస్తారు.
ఈ తరహాలో సాధన కొనసాగిస్తే మీలో క్రమశిక్షణ పెరగడంతో పాటు పరిస్థితులు అర్థం అవుతాయి. సన్నద్ధత వల్లే జట్టు నీనుంచి ఏం ఆశిస్తుందో తెలుస్తుంది’ అని దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ఆడిన రోహిత్ విశ్లేషించాడు.
ఒత్తిడిలో స్పందించడం కీలకం...
టెస్టుల కోసం సిద్ధమయ్యేందుకు మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉండాలని ఈ ముంబైకర్ సూచించాడు. ‘టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి ముందు ఎంతో సన్నద్ధత ఉంటుంది. సుదీర్ఘ ఫార్మాట్ ఆడేటప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యం. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలంటే మానసికంగా ప్రశాంతంగా, దృఢంగా ఉండటం చాలా అవసరం.
మైదానంలో ఎక్కువ సేపు ఆడేందుకు అవసరమైన పట్టుదల సాధనతోనే వస్తుంది. నేను కూడా అలాగే చేశాను. ముందుగా ముంబై తరఫున ఆడటం మొదలు పెట్టినప్పుడు, ఆ తర్వాత భారత్‌కు ఆడినప్పుడు కూడా సన్నద్ధతకే ఎక్కువ సమయం ఇచ్చేవాడిని.
ఒక్కసారి ఆట మొదలైందంటే మనం సొంతంగా చేసేవాటికంటే జరుగుతున్న పరిణామాలకు అప్పటికప్పుడు స్పందించడమే కీలకంగా మారుతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏం చేసినా తీవ్ర ఒత్తిడి మధ్య సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాచ్‌కు ముందు సన్నాహకమే అన్నింటికంటే కీలకంగా మారుతుంది’ అని రోహిత్ వివరించాడు.
చదవండి: ‘సిరాజ్‌ను ఆగమని నేనెలా చెప్తా.. గెలిస్తే చాలు దేవుడా అనుకున్నా’