
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు మంచి ఆరంభమే లభించింది. అతడి సారథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-2తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య జరిగిన ఈ ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో గిల్ 754 పరుగులు సాధించి.. టాప్ రన్ స్కోరర్‌గానూ నిలిచాడు.
సిరాజ్.. సూపర్‌హిట్
ఇక టీమిండియా ఇంగ్లండ్‌తో సిరీస్‌ను సమం చేసుకోవడంలో పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)ది కీలక పాత్ర. ముఖ్యంగా ఆఖరిదైన ఓవల్ టెస్టులో చివరి రోజు ఈ హైదరాబాదీ బౌలర్ అద్భుతమే చేశాడు. విజయానికి ఇంగ్లండ్ 35 పరుగులు.. భారత్ నాలుగు వికెట్ల దూరంలో ఉన్న వేళ.. ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) ఒక వికెట్ తీయగా... సిరాజ్ మూడు వికెట్లు కూల్చి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
అయితే, ఐదో టెస్టు ఆఖరి రోజు ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోగానే.. భుజం విరిగినప్పటికీ టెయిలెండర్ క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు.అప్పటికి క్రీజులో ఉన్న అట్కిన్సన్ వోక్స్‌కు ఇబ్బంది కలగకుండా తానే సింగిల్స్ తీస్తూ.. ఓవర్ ముగిసే సరికి తానే క్రీజులోకి వచ్చేలా చూసుకున్నాడు.
రనౌట్ ప్లాన్
ఈ క్రమంలో కెప్టెన్ గిల్‌తో కలిసి సిరాజ్ ఈ జోడీని రనౌట్ చేయాలని ప్రణాళిక రచించారు. ఇందుకు అనుగుణంగా నాటి మ్యాచ్ 84 ఓవర్లో వైడ్ యార్కర్ వేయాలని వీరు ప్లాన్ చేశారు. ఇక సిరాజ్ సంధించిన డెలివరీని మిస్సయినప్పటికీ.. అట్కిన్సన్ సింగిల్ తీసేందుకు వెళ్లాడు. అయితే, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మాత్రం సరైన సమయంలో బంతిని అందుకోలేకపోయాడు.
దీంతో రనౌట్ ఛాన్స్ మిస్ కాగా.. గిల్‌పై సిరాజ్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. జురెల్‌కు ముందే మన ప్లాన్ చెప్పి ఉండవచ్చు కదా అని అన్నాడు. విజయానంతరం గిల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఇక ధ్రువ్ జురెల్ కూడా తాజా ఈ విషయంపై స్పందించాడు.
సిరాజ్‌ను ఆగమని నేనెలా చెప్తా
‘‘ఆరోజు అంతా త్వరత్వరగా జరిగిపోయింది. మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బాల్ బాగా స్వింగ్ అవుతోంది. అప్పుడు నా కుడివైపు.. గిల్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ‘యార్.. సిరాజ్ ఇప్పుడు వైడ్ యార్కర్ వేయబోతున్నాడు’ అని నాతో చెప్పాడు.
అయితే, నేను బదులిచ్చేలోపే సిరాజ్ బౌలింగ్ వేసేందుకు తన పరుగు మొదలుపెట్టాడు. అప్పుడు.. ‘నువ్వు కాస్త ఆగు’ అని సిరాజ్‌కు చెప్పడం సరికాదనిపించింది. నేను కుదురుకునేలోపే సిరాజ్ బంతి వేయడం.. బ్యాటర్లు పరుగుకు వెళ్లడం జరిగిపోయింది.
గెలిస్తే చాలు దేవుడా అనుకున్నా
నిజానికి అది రనౌట్ కావాల్సింది. కానీ.. నా చేతుల్లో గ్రిప్ అంతగా లేదు. సరైన సమయంలో స్పందించలేకపోయాను. అప్పుడు ఒకటే అనుకున్నా.. ‘దేవుడా.. ఎలాగైనా మమ్మల్ని ఈ మ్యాచ్‌లో గెలిపించు’’ అని ప్రార్థించా.
ఆరోజు రనౌట్ చేసేందుకు నాకు మంచి అవకాశం ఉంది. కానీ నేను మిస్సయిపోయా. ఏదేమైనా సిరాజ్ ఆరోజు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మేము కచ్చితంగా మ్యాచ్ గెలుస్తామని అనుకున్నాం. అనుకున్నదే జరిగింది’’ అని ధ్రువ్ జురెల్ పేర్కొన్నాడు. వివేక్ సేతియా పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది
కాగా రనౌట్ ప్రమాదం నుంచి అట్కిన్సన్- వోక్స్ తప్పించుకునే సమయానికి ఇంగ్లండ్ విజయానికి కేవలం ఎనిమిది పరుగుల దూరంలో ఉంది. ఒకవేళ జురెల్ రనౌట్ మిస్ చేసిన తర్వాత.. సిరాజ్ అట్కిన్సన్‌ను బౌల్డ్ చేయకపోయి ఉంటే టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. ఎట్టకేలకు ఆఖరికి ఆరు పరుగుల తేడాతో ఓవల్‌లో గెలిచి 2-2తో సిరీస్‌ను సమం చేయగలిగింది.