
టీమిండియా అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఒకడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత మోస్ట్ డిపెండబుల్ బ్యాటర్‌గా ఈ సౌరాష్ట్ర ఆటగాడు పేరొందాడు. 2005లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టిన పుజారా.. ఆదివారం (ఆగష్టు 24) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
దేశీ క్రికెట్‌లో సౌరాష్ట్రకు ఆడిన పుజారా.. విదర్భతో మ్యాచ్ సందర్భంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. రోజురోజుకూ తన ఆటను మెరుగపరచుకుని దేశీ క్రికెట్ రన్ మెషీన్‌గా మారిపోయిన పుజ్జీ.. 2025లో గుజరాత్‌తో పోరు సందర్భంగా తన చివరి మ్యాచ్ ఆడేశాడు.
పుజారా నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
ఇక 2010లో టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన పుజారా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2023 ఫైనల్ సందర్భంగా తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. కాగా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పుటలు లిఖించుకున్నాడు పుజారా. ఆట పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న 37 ఏళ్ల పుజారా నెట్‌వర్త్ (Networth) ఎంతో తెలుసా?!
వివిధ మీడియా రిపోర్టుల ప్రకారం పుజారా నికర ఆస్తుల విలువ రూ. 24 కోట్లు అని అంచనా. బీసీసీఐ కాంట్రాక్టులో ‘బి’ కేటగిరిలో ఉన్న ఆటగాడిగా అప్పట్లో రూ. 3 కోట్ల వార్షిక వేతనం పొందిన పుజ్జీ.. మ్యాచ్ ఫీజుల ద్వారా కూడా మంచి మొత్తమే అందుకున్నాడు.
నెల సంపాదన రూ. 15 లక్షలు!
ఇక జాతీయ జట్టుకు దూరమైన తర్వాత దేశీ క్రికెట్ ఆడటం ద్వారా కూడా ఆర్జించిన పుజారా.. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. కామెంటేటర్‌గానూ సేవలు అందిస్తున్నాడు. తాజా రిపోర్టుల సమాచారం ప్రకారం.. అతడి నెల సంపాదన రూ. 15 లక్షలు అని అంచనా.
తన కెరీర్‌లో టీమిండియా తరఫున 103 టెస్టులు ఆడిన పుజారా.. ఏడు వేలకు పైగా పరుగులు సాధించాడు. సంప్రదాయ క్రికెట్‌లో మేటి బ్యాటర్‌గా ఎదిగినప్పటికీ టీ20 ఫార్మాట్లో పెద్దగా రాణించలేకపోయాడు. అందుకే.. ఐపీఎల్‌లో అతడికి ఎక్కువగా ఆడే అవకాశం రాలేదు.
మిగతా వారితో పోలిస్తే కాస్త తక్కువే!
అందుకే తన సమకాలీన ఆటగాళ్లతో పోలిస్తే పుజారా సంపాదన తక్కువగానే అనిపించవచ్చు. నిరాడంబర జీవితానికి పెద్ద పీట వేసే పుజారా గ్యారేజీలో కొన్ని విలాసవంతమైన కార్లు కూడా ఉండటం విశేషం. ఆడి ఏ6, ఫోర్డ్, బీఎండబ్ల్యూ 5- సిరీస్, మెర్సిడెజ్ బెంజ్‌లు పుజ్జీ వద్ద ఉన్నాయి.
పెన్షన్ ఎంతంటే?
రిటైర్ అయిన మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ ప్రతినెలా పెన్షన్ ఇస్తుందన్న విషయం తెలిసిందే. ఆటకు వీడ్కోలు చెప్పిన తమ ప్లేయర్లకు ఆర్థిక చేయూతను ఇవ్వడంతో పాటు.. వారి సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 2022లో పలు మార్పుల అనంతరం.. మాజీ ఆటగాళ్లకు ఇచ్చే పెన్షన్ భారీగానే పెరిగింది.
టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల సంఖ్య, ఎంతకాలం జట్టులో ఉన్నారన్న అంశాలతో పాటు అంతర్జాతీయ టెస్టులు ఆడారా? లేదా? అని పరిశీలించి మూడు కేటగిరీల్లో పెన్షన్ ఇస్తారు.
ఉన్నత శ్రేణిలో ఉన్న వారికి రూ. 70 వేలు, దిగువ శ్రేణి ఆటగాళ్లకు రూ. 60 వేలు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన మాజీ ఆటగాళ్లకు రూ. 30 వేల చొప్పున బీసీసీఐ పెన్షన్ అందిస్తోంది. దీని ప్రకారం పుజారాకు రూ. 60 వేల మేర పెన్షన్ లభించవచ్చు.
చదవండి: AUS vs SA: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా..