
ఆస్ట్రేలియా చేతిలో మూడో వన్డేలో ఘోర పరాజయం పాలైనప్పటికీ.. సౌతాఫ్రికా ఓ అరుదైన రికార్డును మాత్రం తన ఖాతాలో వేసుకుంది. ఆసీస్‌పై ‘అత్యధిక వన్డే సిరీస్’లు గెలిచిన తొలి జట్టుగా నిలిచి చరిత్ర సృష్టించింది. కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన (AUS vs SA)కు వెళ్లిన విషయం తెలిసిందే.
ఆకాశమే హద్దుగా
ఇందులో భాగంగా తొలుత పొట్టి సిరీస్ జరుగగా.. ఆసీస్ ప్రొటిస్‌పై 2-1తో గెలించింది. అయితే, వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన సౌతాఫ్రికా.. మూడో వన్డేల్లో మాత్రం ఓటమిపాలైంది. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఒకరిని మించి ఒకరు దంచికొట్టడంతో ఆసీస్ రికార్డు విజయం ఖాతాలో వేసుకుంది.
276 పరుగుల తేడాతో చిత్తు
మెక్‌కే వేదికగా ఆదివారం జరిగిన చివరి పోరులో ఆస్ట్రేలియా 276 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (Travis Head- 103 బంతుల్లో 142; 17 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ మిచెల్ మార్ష్ (106 బంతుల్లో 100; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), కామెరూన్ గ్రీన్ (Cameron Green- 55 బంతుల్లో 118 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు.
ఇది రెండోసారి మాత్రమే
ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకున్నట్లు వీరంగం ఆడటంతో... ఆస్ట్రేలియా తమ వన్డే చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసుకుంది. ఒకే జట్టుకు చెందిన ముగ్గురు ప్లేయర్లు సెంచరీలు కొట్టడం వన్డేల్లో ఇది రెండోసారి మాత్రమే. హెడ్, మార్ష్ తొలి వికెట్‌కు 250 పరుగులు జోడించగా... వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన గ్రీన్... సఫారీ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు.
బంతి తన పరిధిలో ఉంటే చాలు దాని గమ్యస్థానం బౌండరీనే అన్న చందంగా చెలరేగిన గ్రీన్... ఆసీస్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. వన్డేల్లో అతడికిదే తొలి శతకం కావడం విశేషం. అలెక్స్ కేరీ (37 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
155 పరుగులకే సఫారీలు ఆలౌట్
సఫారీ సీనియర్ పేసర్ కగిసో రబడ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కాగా... ఎంగిడికి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చారు. దీంతో దక్షిణాఫ్రికా బౌలర్ల అనుభవ రాహిత్యాన్ని ఆసీస్ బ్యాటర్లు పూర్తిగా వినియోగించుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 24.5 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది.
డెవాల్డ్ బ్రెవిస్ (28 బంతుల్లో 49; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), టోనీ డి జోర్జి (33) కాస్త పోరాడగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. మార్క్‌రమ్ (2) రికెల్టన్ (11), బవుమా (19), స్టబ్స్ (1), ముల్డర్ (5) పెవిలియన్‌కు వరుస కట్టారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో కూపర్ కొనోలి 22 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదురైనా... తొలి రెండు వన్డేల్లో నెగ్గిన దక్షిణాఫ్రికా జట్టు 2–1తో సిరీస్ కైవసం చేసుకుంది. హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కేశవ్ మహరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి.
ప్రపంచంలోనే తొలి జట్టుగా సౌతాఫ్రికా చరిత్ర
కాగా వన్డే సిరీస్‌లలో సౌతాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా ఐదో పరాజయం. 2016లో మొదలైన ఈ పరాజయ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పటి నుంచి ఆసీస్ ప్రొటిస్ జట్టుపై కేవలం నాలుగు వన్డేలు మాత్రమే గెలిచి.. పదిహేను ఓడిపోయింది.
ఇక తాజా సిరీస్ విజయంతో సౌతాఫ్రికా సరికొత్త చరిత్ర లిఖించింది. మూడు మ్యాచ్‌లకు పైగా వన్డే సిరీస్‌లో ఆసీస్‌పై అత్యధికసార్లు గెలిచిన జట్టుగా నిలిచింది. ఇప్పటికి ఆసీస్‌తో పదిహేను వన్డే సిరీస్‌లు ఆడిన సౌతాఫ్రికా తొమ్మిది గెలిచింది. అంతేకాదు.. ఆసీస్ గడ్డపై అత్యధికంగా మూడు వన్డే సిరీస్‌లు గెలిచిన జట్టుగానూ ప్రొటిస్ నిలిచింది.
ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సిరీస్‌లు గెలిచిన జట్లు
🏆సౌతాఫ్రికా- 15 సిరీస్‌లకు గానూ తొమ్మిదింట విజయం
🏆ఇంగ్లండ్- 21 సిరీస్‌లకు గానూ ఎనిమిదింట విజయం
🏆టీమిండియా- 14 సిరీస్‌లకు గానూ ఆరింట విజయం
🏆శ్రీలంక- 8 సిరీస్‌లకు గానూ నాలుగింట విజయం
🏆పాకిస్తాన్- 11 సిరీస్‌లకు గానూ నాలుగింట విజయం.
చదవండి: KCL: సంజూ శాంసన్ విధ్వంసం.. 16 బంతుల్లోనే! వీడియో వైరల్