
గంటల తరబడి క్రీజులో పాతుకుపోగల నైపుణ్యం... సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల ఆత్మస్థయిర్యం! ఒత్తిడిని చిత్తు చేయగల దృఢ సంకల్పం... ప్రత్యర్థుల సహనాన్ని పరీక్షించగల మనోధైర్యం! ఒక్క మాటలో చెప్పాలంటే... నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం!!
క్రీజులో అడుగుపెట్టింది తడువు ఓ మహాయజ్ఞానికి పూనుకున్నట్లు... పిచ్, పరిస్థితులు, ప్రత్యర్థులు ఇలా వేటితో సంబంధం లేకుండా తన కర్తవ్యాన్ని వందకు రెండొందల శాతం నిర్వర్తించిన టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా.
ఎన్నో మరపురాని విజయాలు
పదిహేనేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు పుజారా ఆదివారం (ఆగష్టు 24) రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ పేసర్లు బాడీలైన్ బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టినా... ఇంగ్లండ్ పిచ్‌లపై అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ వంటి వాళ్లు స్వింగ్‌తో ఊరించినా... వికెట్ విలువ గుర్తెరిగి ప్రత్యర్థులకు టీమిండియాకు మధ్య అడ్డుగోడలా నిలిచిన పుజారా జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు.
విరాట్ కోహ్లి లాంటి కవర్ డ్రైవ్‌లు, రోహిత్ శర్మ లాంటి పుల్ షాట్‌లు, రిషబ్ పంత్ వంటి ఫాలింగ్ హుక్ షాట్‌లు ఆడగల సామర్థ్యం లేకున్నా... కేవలం తన సహనంతోనే సుదీర్ఘ కాలం జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఘనత పుజారాది.
1258 బంతులు.. 521 పరుగులు
ఫోర్లు, సిక్స్‌ల రూపంలో కొలవలేని గొప్పతనం అతడిది. సెంచరీలు, డబుల్ సెంచరీలు వివరించలేని ఆటతీరు అతడిది. టీ20లు రాజ్యమేలుతున్న తరుణంలోనూ సంప్రదాయ క్రికెట్‌కే పెద్దపీట వేస్తూ... సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన అతడి ఘనతలను స్ట్రయిక్‌రేట్‌తో సరితూచడం సాధ్యం కానిది.
2018–19లో ఆ్రస్టేలియా గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ గెలవడం వెనక దాగిఉన్న పుజారా అకుంఠిత దీక్షను లెక్కించేందుకు కొలమానాలు లేవనడం అతిశయోక్తి కాదు. 1258 బంతులు ఎదుర్కొన్న అతడు 521 పరుగులతో సిరీస్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
ఇక 2021 బ్రిస్బేన్ టెస్టులో ఆ్రస్టేలియాపై అతడు కనబర్చిన పోరాటపటిమ ముందు ఎన్ని త్రిశతకాలైన దిగదుడుపే. తొలి ఇన్నింగ్స్‌లో 94 బంతులాడిన పుజారా... రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 211 బంతులు ఎదుర్కొని 56 పరుగులు సాధించిన వైనాన్ని ఏ క్రీడాభిమాని మరవగలడు.
భర్తి చేసేదెవరో?
అతడి వికెట్ పడగొట్టడం సాధ్యంకాని ఆసీస్ పేసర్లు బాడీలైన్ బౌలింగ్‌తో విజృంభించినా... వెన్నుచూపకుండా వికెట్ల ముందు వీరుడిలా నిలిచిన తీరును ఏ గణాంకాలతో లెక్కించగలం! ఒకటా రెండా... జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఎన్నో సార్లు విలువైన ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించిన పుజారా ఆటకు అల్విదా చెప్పాడు. అతడి స్థానాన్ని భర్తి చేసేదెవరో చూడాలి మరి!
–సాక్షి క్రీడా విభాగం
చదవండి: KCL: సంజూ శాంసన్ విధ్వంసం.. 16 బంతుల్లోనే! వీడియో వైరల్
Cheteshwar Pujara announced himself on the international stage with a gritty 159 against New Zealand in 2012.
Relive his maiden Test ton here 👇👇#ThankYouPujji | @cheteshwar1 pic.twitter.com/5bmR9VU1KQ— BCCI (@BCCI) August 24, 2025