సౌతాఫ్రికా టీ20లో ఎంఐ కేప్‌టౌన్ ఆటగాడు ర్యాన్ రికెల్టన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. లీగ్ చరిత్రలో రెండు వ్యక్తిగత సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రికెల్టన్ కాకుండా SA20లో మరో ఎనిమిది మంది (డుప్లెసిస్, క్లాసెన్, మార్క్రమ్, డస్సెన్, హెర్మన్, విల్ జాక్స్, వెర్రిన్, హోప్) మాత్రమే తలో సెంచరీ చేశారు.
రికెల్టన్ తలో రెండో సెంచరీని 2025-26 ఎడిషన్‌లో భాగంగా జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నమోదు చేశాడు. రికెల్టన్ తన తొలి సెంచరీని డర్బన్ సూపర్ జెయింట్స్‌పై చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. రికెల్టన్ విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 113 నాటౌట్; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో సూపర్ కింగ్స్‌పై ఎంఐ కేప్ టౌన్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేయగా.. ఛేదనలో పోరాడిన సూపర్ కింగ్స్ లక్ష్యానికి 37 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేయగలిగింది. సూపర్ కింగ్స్ తరఫున డియాన్ ఫెరియెరా (80 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినా, తన జట్టును గెలుపు తీరాలు దాటించలేకపోయాడు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జేమ్స్ విన్స్ (77) కూడా మెరుపు అర్ద సెంచరీతో రాణించాడు.
ఎంఐ బౌలర్ల జోరు ముందు వీరి మెరుపులు సరిపోలేదు. జార్జ్ లిండే, రబాడ తలో 2, కార్బిన్ బాష్ ఓ వికెట్ తీయగా.. రషీద్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేసి సూపర్ కింగ్స్‌ను కట్టడి చేశారు. అంతకుముందు ఎంఐ ఇన్నింగ్స్‌లో రికెల్టన్‌తో పాటు మరో ఓపెనర్ డస్సెన్ (65) కూడా రాణించాడు. మిగతా బ్యాటర్లలో పూరన్ 14, జేసన్ స్మిత్ 2, కరీం జనత్ 20 (నాటౌట్) పరుగులు చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో డేనియల్ వార్రల్ 2, ఫెరియెరి తలో వికెట్ తీశారు.


