
పట్టుదల, అంకితభావం, దీర్ఘకాలం పాటు వికెట్ పడకుండా కాపాడుకునే నైపుణ్యం, పోరాటపటిమ.. టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara)లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. స్ట్రైక్‌రేటు, బౌండరీ కౌంట్ అంటూ టీ20 మోజులో ఆటగాళ్లు పడిపోయిన వేళ.. పుజ్జీ మాత్రం సంప్రదాయ క్రికెట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు.
నయా వాల్
కీలక సమయాల్లో గంటల తరబడి క్రీజులో నిలబడటం.. ప్రత్యర్థి బౌలర్ల చేతుల నుంచి తూటాల్లా దూసుకు వస్తున్న బంతులు శరీరాన్ని గాయపరుస్తున్నా.. జట్టు పరాజయానికి అడ్డుగోడలా నిలవడం నయా క్రికెటర్లలో అతడికే సాధ్యమైంది. అందుకే రాహుల్ ద్రవిడ్ వారసుడిగా.. ‘నయా వాల్’గా పుజారాను పిలుచుకుంటారు.
తన కెరీర్‌లో 103 టెస్టులు ఆడిన 37 ఏళ్ల పుజారా ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం (ఆగష్టు 24) ఆటకు అల్విదా చెబుతున్నట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పుజ్జీ తన కెరీర్ తొలినాళ్ల నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు.
సెంచరీ చేసి అవుటైన తర్వాత..
‘‘దేశీ క్రికెట్‌లో నేను సౌరాష్ట్ర జట్టుకు ఆడాను. అప్పట్లో మా జట్టు కాస్త బలహీనంగా ఉండేది. నాకింకా గుర్తే.. అండర్-14 టీమ్‌కు ఆడుతున్న రోజుల్లో నేను సెంచరీ చేసి అవుటైన తర్వాత.. మా జట్టు 220-230 పరుగులలోపే ఆలౌట్ అయ్యేది. ఒక్కోసారి 180-190 పరుగులకే కుప్పకూలేది.
అలాంటి సందర్భాల్లో చాలాసార్లు మా జట్టు ఓడిపోయేది. అప్పుడే నాకో విషయం అర్థమైంది. జట్టును గెలిపించాలంటే కేవలం సెంచరీలు చేస్తే సరిపోదు. వాటిని 150, డబుల్ సెంచరీ.. అవసరమైతే ట్రిపుల్ సెంచరీగా మలచాలి.
సెంచరీ చేస్తే సరిపోదు..
అండర్- 14, 16, 19.. ఏ దశలోనైనా రాణించగలగాలి. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలంటే ఓపిక, క్రమశిక్షణ, అంకితభావం అవసరం. క్రమక్రమంగా నేను వాటిని అలవాటు చేసుకున్నా. రంజీ ట్రోఫీ టోర్నీలోనూ ఇవే కొనసాగించేవాడిని. నా అరంగేట్ర సమయంలోనే సౌరాష్ట్ర ప్లేట్ డివిజన్ నుంచి ఎలైట్ డివిజన్‌కు ప్రమోట్ అయ్యింది.
అయినప్పటికీ.. మిగతా జట్లతో పోలిస్తే మేమే బలహీనంగా కనిపించేవాళ్లం. అందుకే సెంచరీ చేస్తే సరిపోదు.. జట్టును గెలిపించాలంటే ప్రత్యర్థిని కట్టడి చేయడం కూడా ఎంతో ముఖ్యమని అర్థం చేసుకున్నా. అదే అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కొనసాగించాను. ఒక్కసారి ఓ మంచి అలవాటు చేసుకుంటే.. అది సుదీర్ఘకాలం మనకు సత్ఫలితాలను ఇస్తుంది’’ అని పుజారా క్రిక్‌బజ్‌తో పేర్కొన్నాడు.
దేశీ క్రికెట్‌లో పరుగుల వరద
కాగా టీమిండియా తరఫున 103 టెస్టుల్లో పుజ్జీ 7195 పరుగులు సాధించాడు. ఇందులో 35 ఫిఫ్టీలు, 19 శతకాలు, మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అయితే, తరచూ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ జాతీయ జట్టులో చోటు కోల్పోయేవాడు.
అయితే, దేశీ క్రికెట్లో తనను తాను నిరూపించుకోవడం ద్వారా తిరిగి పునరాగమనం చేసేవాడు పుజారా. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పుజారా ఏకంగా 21,301 పరుగులు సాధించాడు. ఇందులో 66 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా పద్దెనిమిది డబుల్ సెంచరీలు పుజ్జీ ఖాతాలో ఉన్నాయి.