
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఘన సత్కారం లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) హిట్‌మ్యాన్‌ను తన ఇంటికి ఆహ్వానించి.. సన్మానించారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
కాగా రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ (Test Cricket Retirement) ప్రకటించిన విషయం తెలిసిందే. మే 7న ఇందుకు సంబంధించి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అధికారిక ప్రకటన విడుదల చేశాడు. తెలుపు రంగు జెర్సీలో దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమంటూ భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు.
అయితే, వన్డేల్లో మాత్రం తాను కొనసాగుతానని రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. అతడే వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని పేర్కొంది.
అధికారిక నివాసానికి ఆహ్వానించిన సీఎం
కాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అతడిని తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. పుష్ఫగుచ్ఛం అందించి.. శాలువాతో రోహిత్‌ను ఫడ్నవిస్ సత్కరించారు. అతడితో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ.. ‘‘భారత క్రికెట్ రోహిత్ శర్మను నా అధికారిక నివాసం ‘వర్ష’కు ఆహ్వానించడం.. ఆయనను కలిసి మాట్లాడటం ఎంతో గొప్పగా అనిపిస్తోంది.
టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌కు ప్రకటించిన రోహిత్ శర్మకు శుభాకాంక్షలు. జీవితంలోని తదుపరి అధ్యాయంలోనూ ఆయన ఇలాగే మరింత విజయవంతం కావాలని ఆశిస్తున్నా’’ అని దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు.
దిగ్గజ కెప్టెన్‌గా
కాగా టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇప్పటికే రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలపడంతో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (వన్డే) కూడా అందించాడు. అయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం రోహిత్ శర్మ ప్రదర్శన ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా బాగాలేదు.
రోహిత్ సారథ్యంలో టీమిండియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది సొంతగడ్డపై విదేశీ జట్టు చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా.. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఫలితంగా ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (2025) ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.
కోహ్లి కూడా ఇదే బాటలో
ఆ తర్వాత ముంబై తరఫున రోహిత్ శర్మ రంజీ బరిలో దిగి కూడా విఫలమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనూ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ బీసీసీఐ అతడినే కెప్టెన్‌గా కొనసాగిస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా బుధవారం రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇక ఆ తర్వాత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు. వీరిద్దరు లేకుండానే జూన్ 20 నుంచి టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టీమిండియా కొత్త కెప్టెన్‌గా నియమితుడు కానున్నట్లు తెలుస్తోంది.
చదవండి: Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ ఆడటం కష్టం.. వాళ్లిద్దరు ఉంటే బెటర్!