
టీమిండియా ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) స్థానాల్లో వెటరన్ క్రికెటర్లను తీసుకువస్తే బాగుంటుందని సెలక్టర్లకు సలహా ఇచ్చాడు. అజింక్య రహానే (Ajinkya Rahane), ఛతేశ్వర్ పుజారాలను జట్టులోకి తిరిగి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
దిగ్గజాల వీడ్కోలు
ఇంగ్లండ్ గడ్డపై రాణించాలంటే ఇలాంటి సీనియర్ల అవసరం ఉందని.. యువ ఆటగాళ్లు అక్కడ ఒత్తిడిని తట్టుకోలేరని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
తొలుత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. ఆ తర్వాత ఆరు రోజులలోపే కోహ్లి కూడా ఇదే బాటలో నడిచాడు. వీరిద్దరి నిష్క్రమణ కంటే ముందే దిగ్గజ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు.

ఫలితంగా టీమిండియా టెస్టు జట్టులో సీనియర్లు లేనిలోటు కచ్చితంగా కనిపిస్తుంది. అదీ ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టును వారి సొంత గడ్డపై ఎదుర్కోవడం యువ ఆటగాళ్లకు అంతతేలికేమీ కాదు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ..
రహానే, పుజారా రీ ఎంట్రీ
‘‘రోహిత్ రిటైర్ అయినా విరాట్ కోహ్లి జట్టుతో కొనసాగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ బోర్డు అతడిని ఒప్పించేందుకు విఫలయత్నం చేసిందని తెలిసింది. మరి అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాల పునరాగమనం ఇప్పుడైనా చూడవచ్చా? ఈ ఒక్క సిరీస్ కోసమైనా వాళ్లను ఎంపిక చేస్తారా?
అసలు జట్టు సరైన దిశలోనే వెళ్తుందా? రాబోయేది అల్లాటప్పా సిరీస్ కాదు.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలి. వేరే జట్టుతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటే.. పర్లేదు కుర్రాళ్లని పంపవచ్చు అని అనుకోవచ్చు.
కానీ ప్రస్తుత పరిస్థితి అంత తేలికగా తీసుకునేలా లేదు. కచ్చితంగా రహానే, పుజారాల గురించి ఆలోచించాలి. వాళ్లిద్దరు ఇంకా అద్భుతంగా ఆడుతున్నారు. పరుగులు కూడా రాబడుతున్నారు. వాళ్లు జట్టుతో ఉంటే కుర్రాళ్లకు కాస్త ధైర్యంగా ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు.
చివరగా అపుడే
కాగా రహానే 2023 జూలైలో చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఇక మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్‌లో 85 టెస్టులు ఆడి 5077 పరుగులు సాధించాడు. మరోవైపు.. ఛతేశ్వర్ పుజారా 103 టెస్టులాడి 7195 పరుగులు సాధించాడు. నయా వాల్‌గా పేరొందిన పుజ్జీ చివరగా 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
ఆ తర్వాత జట్టుకు దూరమైన వీరిద్దరు రంజీల్లో అదరగొడుతున్నారు. అయితే, రహానే, పుజారాలను మాత్రం సెలక్టర్లు ఇన్నాళ్లూ పరిగణనలోకి తీసుకోలేదు. మరి ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలోనైనా వీరికి పిలుపునిస్తారేమో చూడాలి!