’నేను, కోహ్లి, రోహిత్‌ రిటైర్‌ అవ్వాలని గంభీర్‌ కోరుకున్నా పర్లేదు’ | If Gambhir Thought Me, Kohli, Sharma Should Move On Its Okay: R Ashwin | Sakshi
Sakshi News home page

’నేను, కోహ్లి, రోహిత్‌ రిటైర్‌ అవ్వాలని గంభీర్‌ కోరుకున్నా పర్లేదు’

Mar 18 2026 4:05 PM | Updated on Mar 18 2026 4:34 PM

If Gambhir Thought Me, Kohli, Sharma Should Move On Its Okay: R Ashwin

టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన రిటైర్మెంట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ తన పనిని సరిగ్గానే చేశాడని పేర్కొన్నాడు. ఏదేమైనా సరైన సమయంలోనే తాను ఆటకు వీడ్కోలు పలికానని భావిస్తున్నట్లు తెలిపాడు.

గంభీర్‌ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్లకే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా.. టూర్‌ మధ్యలోనే అనూహ్యంగా అశూ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆసీస్‌తో తొలి టెస్టులో అశూను బెంచ్‌కే పరిమితం చేసిన యాజమాన్యం.. వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar)ను ఆడించింది.

పిలిచి.. మళ్లీ తప్పించి
అయితే, రెండో టెస్టు కోసం అశూను పిలిపించింది. ఆ తర్వాత మూడో టెస్టులో అతడి స్థానాన్ని రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో భర్తీ చేశారు. దీంతో ఈ మ్యాచ్‌ ముగిసిన వెంటనే అశ్విన్‌ రిటైర్మెంట్‌ ఇవ్వడం చర్చకు దారితీసింది. ఇందుకు గంభీర్‌ కారణం అయి ఉంటాడనే ఊహాగానాలు వచ్చాయి.

ఏదేమైనా టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన అనిల్‌ కుంబ్లే (619) తర్వాతి స్థానాన్ని ఆక్రమించిన అశూ (537).. ఇంకొన్నాళ్లు ఆడి ఉంటే అతడి రికార్డు సమం చేయగలిగే వాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అశూ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

అదే  అతిపెద్ద బలం
‘‘సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం నాకున్న అతిపెద్ద బలం. అది తప్పా, ఒప్పా అని ప్రజలు చర్చించుకున్నా నేనేం పట్టించుకోను. పెర్త్‌లో వాషీ, ఆ తర్వాత అడిలైడ్‌లో నేను, బ్రిస్బేన్‌లో జడేజా.. ఇలా ఒకరి తర్వాత ఒకరం స్పిన్‌ దళాన్ని నడిపించాము.

నేను జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాను. దానర్థం వాషీ, జడ్డూకు నేను మార్గం సుగమం చేయాలనే కదా అనిపించింది. వద్దన్నా నేను పట్టుకుని వేలాడే రకం కాదు. కెరీర్‌లో నేను చాలా దూరం వచ్చేశాను. అనుకున్నవి సాధించగలిగాను. కొంతమంది ఈ విషయంలో గంభీర్‌ గురించి వారికి నచ్చినట్లు మాట్లాడారు.

నేను, కోహ్లి, రోహిత్‌ రిటైర్‌ అవ్వాలని గంభీర్‌ కోరుకున్నా పర్లేదు
కోచ్‌గా తన జాబ్‌ తాను చేశాడు. ఒకవేళ నేను, విరాట్‌, రోహిత్‌.. రిటైర్మెంట్‌ ప్రకటించాలని ఆయన కోరుకుని ఉండవచ్చు. హెడ్‌కోచ్‌గా ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఇందులో తప్పుబట్టడానికి ఏమీలేదు.

స్వార్థం, ఈగో వదిలేయాలని నేను ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మనం మనుషులం. భావోద్వేగాలు ఉండటం సహజం’’ అని అశూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. 

కాగా ఆసీస్‌ టూర్‌  తర్వాత అకస్మాత్తుగా రోహిత్‌ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పగా.. అనూహ్య రీతిలో టెస్టు దిగ్గజ బ్యాటర్‌ కోహ్లి సైతం ఇదే బాటలో నడిచాడు. దీంతో గంభీర్‌పై మరోసారి విమర్శలు వచ్చాయి. 

చదవండి: T20 WC Final: ’అర్ష్‌దీప్‌ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement