
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) నిర్ణయం పట్ల భారత జట్టు మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ విచారం వ్యక్తం చేశాడు. కోహ్లి తొందరపడ్డాడని.. ఇంగ్లండ్ (IND vs ENG)తో సిరీస్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
తానే గనుక సెలక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్‌ని అయి ఉంటే.. ఈ సిరీస్‌కు కోహ్లినే కెప్టెన్‌ని చేసేవాడినని ఈ మాజీ చీఫ్ సెలక్టర్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేశాడు.
పది వేల పరుగుల మైలురాయికి చేరకుండానే..
కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు. అయితే, తనకు మరోసారి సారథిగా అవకాశం ఇవ్వాలని కోహ్లి కోరాడని.. అయితే, యాజమాన్యం ఇందుకు నిరాకరించిందనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే అతడు వీడ్కోలు పలకడం అనుమానాలను పెంచింది.
ఏదేమైనా టెస్టుల్లో పది వేల పరుగుల మైలురాయికి కేవలం 770 పరుగుల దూరంలో కోహ్లి నిలిచిపోయాడు. సంప్రదాయ ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన ఈ సారథి.. భారమైన హృదయంతో వైదొలిగాడు. ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బాస్.. ఈ జట్టుకు నువ్వే కెప్టెన్‌గా ఉండాలి
రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ నేనే గనుక ఇప్పుడు సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవిలో ఉండి ఉంటే.. ‘బాస్.. ఈ జట్టుకు నువ్వే కెప్టెన్‌గా ఉండాలి. భారత టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురా.. ఆ తర్వాత టెస్టు క్రికెట్‌ను వదిలెయ్’ అని చెప్పేవాడిని.
నిజానికి సెలక్టర్లు అతడిని ఒప్పించి ఉండాల్సింది. నేను గనుక అక్కడ ఉంటే.. అతడే కెప్టెన్‌గా ఉండాలని పట్టుబట్టేవాడిని. టీమిండియా గాడిలో పడిన తర్వాత రిటైర్ అవమని చెప్పేవాడిని. అతడికి అదే సరైన వీడ్కోలు అయి ఉండేది’’ అని చిక్కా చెప్పుకొచ్చాడు.
ప్రత్యేక ప్రతిభ
అదే విధంగా.. తాను సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్న శ్రీకాంత్.. ‘‘కోహ్లిలో ప్రత్యేక ప్రతిభ దాగి ఉంది. ఆట పట్ల అంకిత భావం, నిబద్ధత.. అతడిని ఈ స్థాయికి చేర్చాయి. కఠినంగా శ్రమించడం తనకు అలవాటు.
అతడు గొప్ప బ్యాటర్ కాగలడనే నమ్మకం మాకు ఉంది. అందుకే ఆరోజు కోహ్లిని అందరికంటే ముందుగా ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేశాము’’ అని తెలిపాడు. కాగా 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లి.. 2011-12 నాటి సిరీస్‌లో ఆస్ట్రేలియా గడ్డమీద తొలి శతకం సాధించాడు.
తన కెరీర్‌లో మొత్తంగా 123 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 9230 పరుగులు సాధించాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల నుంచి కూడా రిటైర్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు.