
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం టీమిండియా మీద కేంద్రీకృతమై ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత.. వారి స్థానాల్ని భర్తీ చేసేదెవరన్న చర్చ నడుస్తోంది. కాగా గత కొంతకాలంగా సంప్రదాయ ఫార్మాట్లో ఘోర పరాభవాలు చవిచూసిన భారత జట్టు.. తదుపరి ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది.
ఇరు జట్ల మధ్య ఈ మేర ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఆరంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ కీలక సిరీస్‌కు టీమిండియా ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే వెళ్లనుండటం ఆసక్తిగా మారింది.
పనిభారం పడకుండా ఉండేందుకే?
ఇక ఈ సిరీస్ నుంచి యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైపోయిందనే వార్తలు వస్తున్నాయి. ప్రధాన పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాపై పనిభారం పడకుండా ఉండేందుకే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బుమ్రా కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే క్రమంలో తనకు తానుగా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకొన్నాడని మరికొన్ని వార్తలు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టెస్టు కెప్టెన్‌గా బుమ్రానే సరైనోడు
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను కాదని.. బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సన్నీ అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రతి ఒక్కరు పనిభారం అంటూ బుమ్రా గురించి ఏదేదో మాట్లాడేస్తున్నారు. నిజానికి అతడికి మాత్రమే ఈ వర్క్‌లోడ్ గురించి పూర్తిగా తెలుస్తుంది. తన శరీరం ఒత్తిడిని తట్టుకోగలదా? లేదా ? అనేది బుమ్రాకు మాత్రమే తెలుస్తుంది.
ఆ కారణంతో కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడం సరికాదు. ఎందుకంటే కెప్టెన్‌గా ఇతరులు ఎవరు ఉన్నా.. బుమ్రాతో అదనపు ఓవర్లు వేయించాలనే చూస్తారు. మరి అలాంటపుడు పనిభారం పెరగదా?

జట్టులో బుమ్రా నంబర్ వన్ బౌలర్. తనే కెప్టెన్‌గా ఉంటే ఎప్పుడు విరామం తీసుకోవాలి.. ఎప్పుడు బరిలోకి దిగాలనే విషయాల్లో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోగలడు. అందుకే నా వరకైతే జస్‌ప్రీత్ బుమ్రానే తదుపరి టెస్టు కెప్టెన్‌గా నియమించాలి.
పనిభారం అంటూ వచ్చే ఊహాగానాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో బుమ్రాకు బాగా తెలుసు. కెప్టెన్‌గా అతడే ఉండటం అత్యుత్తమ నిర్ణయం అని నా అభిప్రాయం’’ అని గావస్కర్ స్పోర్ట్స్ టుడేతో వ్యాఖ్యానించాడు.
గతంలోనూ నాయకుడిగా
కాగా బుమ్రా గతంలో ఓసారి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు జట్టు నాయకుడిగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలుత పెర్త్‌లో.. ఆఖరిగా సిడ్నీలో ఐదో టెస్టులో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా వెన్నునొప్పి తిరగబడటంతో దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్-2025తో ఇటీవలే పునరాగమనం చేశాడు. ఇదిలా ఉంటే.. జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది.
చదవండి: CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే!