
PC: BCCI
భారత టెస్టు క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. దిగ్గజ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli Retirement) సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు భారమైన హృదయంతో వెల్లడించాడు.
బీసీసీఐ ట్వీట్
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కోహ్లికి కృతజ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ‘‘టెస్టు క్రికెట్‌లో ఓ శకం ముగిసిపోయింది.. కానీ వారసత్వం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుంది.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే, టీమిండియాకు ఆయన చేసిన సేవలు ఎల్లప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. థాంక్యూ విరాట్ కోహ్లి’’ అంటూ కోహ్లి ఫొటోలు పంచుకుంది.
దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా?
అయితే, బీసీసీఐ తీరుపై టీమిండియా, కోహ్లి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల్లో వరుస వైఫల్యాలకు కేవలం ఆటగాళ్లనే బాధ్యుల్ని చేయడం సరికాదంటూ చురకలు అంటిస్తున్నారు.
కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో భారత జట్టు ఘోర పరాభవాలు చవిచూసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో 3-0తో వైట్‌వాష్ కావడంతో పాటు.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025ని 3-1తో చేజార్చుకుంది.
రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా
ఈ రెండు సిరీస్‌లలోనూ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా విఫలయ్యాడు. పెర్త్‌లో సెంచరీ బాదినప్పటికీ.. ఆ తర్వాత ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడే క్రమంలో దాదాపు ఎనిమిది సార్లు ఒకే రీతిలో అవుటయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగి.. అక్కడా విఫలమయ్యాడు.
ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిల ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. అయితే, వీళ్లిద్దరు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముగిసేంత వరకు మాత్రం జట్టుతో ఉంటారని అంతా భావించారు. అంతలోనే బుధవారం రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు.
కాగా రోహిత్‌ను వైదొలగాల్సిందిగా ముందుగానే సెలక్టర్లు కోరగా.. కోహ్లిని మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కోహ్లి కెప్టెన్సీ చేపట్టాలనే ఉద్దేశంతో ఉండగా.. ఇందుకు బీసీసీఐ నిరాకరించిందని బోర్డు సన్నిహిత వర్గాలు చెప్పడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.
బలవంతంగా రిటైర్ అయ్యేలా చేశారని
మరోవైపు.. కోచ్‌గా గౌతం గంభీర్ విఫలమైనా ఎలాంటి చర్యలు చేపట్టని బీసీసీఐ.. రోహిత్, కోహ్లిలను మాత్రం బలవంతంగా రిటైర్ అయ్యేలా చేసిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ ఇద్దరూ.. ముఖ్యంగా టెస్టుల్లో భారత్‌ను అగ్రపథంలో నిలిపిన కోహ్లికి మైదానంలో ఘనంగా వీడ్కోలు పలకాల్సింది పోయి... ఇలా సోషల్ మీడియాలో సాధారణ ఆటగాళ్లలా రిటైర్మెంట్ ప్రకటించే దుస్థితి కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పది వేల పరుగులు చేస్తానంటూ
ఒకవేళ కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకుంటే ఈ ఏడాది ఆరంభంలోనే సిడ్నీ టెస్టులోనే వీడ్కోలు ఏర్పాటు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇప్పటికిప్పుడు వీరిద్దరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉందని కనిపిస్తోందంటున్నారు. ఈ సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగులు చేస్తానంటూ కోహ్లి గతంలో చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. కాగా కోహ్లి తన టెస్టు కెరీర్‌లో 9230 పరుగులు చేశాడు. ఈ మైలురాయికి 770 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
చదవండి: PSL 2025: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు!