ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డారెన్ లెహ్‌మన్ కొడుకు జేక్ లెహ్‌మన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ 33 ఏళ్ల ఎడమ చేతి బ్యాటర్‌ను 2024-25 సీజన్‌కు గానూ మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జేక్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయాక ఈ అవార్డు లభించింది.
ఆసీస్ దేశవాలీ క్రికెట్‌లో సుదీర్ఘంగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు రాకపోవడంతో జేక్ గత నెలలోనే తన బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఆధారంగా ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. అక్కడ అతను హ్యాంప్‌షైర్ కౌంటీతో లోకల్ ప్లేయర్ కేటగిరీలో రెండు సంవత్సరాల ఒప్పందం చేసుకున్నాడు.
ఓ ఆటగాడు ఇతర దేశం తరఫున లోకల్ కేటగిరీలో అవకాశం దక్కించుకుంటే, తన సొంత దేశానికి ఆడే అర్హత కోల్పోతాడు. జేక్ విషయంలో ఇదే జరిగింది. జేక్ హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకోవడం వల్ల ఆస్ట్రేలియాకు ఆడాలన్న తన కలను చెరిపేసుకున్నాడు.
షెఫీల్డ్ షీల్డ్‌లో రికార్డు ప్రదర్శన
జేక్ 2024-25 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో దక్షిణ ఆస్ట్రేలియా తరఫున రికార్డు ప్రదర్శన చేశాడు. 10 మ్యాచ్‌ల్లో నాలుగు వరుస సెంచరీల సాయంతో 44.11 సగటున 750 పరుగులు చేశాడు. ఆ సీజన్ ఫైనల్లో జేక్ చేసిన సెంచరీ దక్షిణ ఆస్ట్రేలియాకు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రెడ్‌బాల్ టైటిల్‌ను అందించింది.
తండ్రి వారసత్వం
జేక్ తండ్రి డారెన్ లెహ్‌మన్ తన జమానాలో మూడుసార్లు డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు అతని కుమారుడు జేక్ కూడా ఆ అవార్డును తొలిసారి గెలుచుకుని తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాడు. ఈ అవార్డుకు ఎంపికైన తర్వాత జేక్ మాట్లాడుతూ .. ఇది నాకు షాక్‌లా అనిపించింది. గత 18 నెలలుగా మంచి క్రికెట్ ఆడుతున్నాను. సహచరులు, ప్రత్యర్థులు ఇచ్చిన గుర్తింపు ప్రత్యేకమైనది. ఈ అవార్డు నాకు గౌరవమని అన్నాడు.
ఆస్ట్రేలియాకు ఆడటం నా కల
జేక్ ఆసీస్ తరఫున ఆడే అవకాశాల కోసం సుదీర్ఘంగా ఎదురుచూసి గత నెలలోనే ఇంగ్లండ్ కౌంటీ హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు ఆడటం నా కల. కానీ అది సాధ్యం కాలేదు. అయినా 12 సంవత్సరాలుగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడినందుకు గర్వంగా ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సమయం ఆసన్నమైందని అన్నాడు.


