గుర్తించలేని విధంగా దగ్ధమైన శరీరాలు
డీఎన్ఏ పరీక్షలే అత్యంత కీలకం
భారత్‌లోని ఎంబసీలే నిర్వహించే చాన్స్
డీఎన్ఏ తేలాకే.. మృతదేహాల గుర్తింపు
సౌదీలోనే మృతదేహాల ఖననాలకు చాన్స్
పవిత్ర భూమిలోనే అంతిమయాత్రకు ముస్లింల మొగ్గు!
రియాద్: సౌదీఅరేబియాలోని మదీనా సమీపంలో చోటుచేసుకున్న ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతిచెందగా.. వారి మృతదేహాలు గుర్తించలేని విధంగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన హైదరాబాదీల మృతదేహాలను వెనక్కి రప్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా.. సౌదీ చట్టాల ప్రకారం ఈ ప్రక్రియ కొంత క్లిష్టమైనదేనని తెలుస్తోంది. సౌదీలో మరణిస్తే.. పరిస్థితులు ఏమిటనేదానిపై ‘సాక్షి వెబ్’ ప్రత్యేక కథనం..
సౌదీఅరేబియాతోపాటు.. ఇతర గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఒకేలా ఉంటాయి. అక్కడ ఎవరైనా మరణిస్తే.. వారి రక్తసంబంధీకుల అనుమతితోనే మృతదేహాల తరలింపు ఉంటుంది. లేనిపక్షంలో.. ఎన్ని సంవత్సరాలైనా అక్కడి ప్రభుత్వాలు మృతదేహాలను మార్చురీల్లో భద్రపరుస్తాయి. ఇటీవల బహ్రెయిన్‌లో ఇద్దరు తెలంగాణ, మరో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పౌరుల మృతదేహాలు ఐదేళ్లుగా అక్కడి మార్చురీల్లో ఉన్న వార్తలు పతాకశీర్షికలకెక్కిన విషయం తెలిసిందే..! రక్తసంబంధీకులు ప్రభుత్వాలను సంప్రదించాక.. భారతీయ ఎంబసీల నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తప్పనిసరి. ఆ తర్వాతే గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు మృతదేహాల తరలింపునకు అనుమతినిస్తాయి. ఆ అనుమతులు ఉంటేనే.. విమానయాన సంస్థలు మృతదేహాలను తరలించేందుకు అంగీకరిస్తాయి.
మదీనా ప్రమాదంలో..
మదీనా ప్రమాదంలో బస్సు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఐదారు గంటల పాటు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయినట్లు సౌదీలోని భారతీయులు ‘సాక్షి’కి వివరించారు. ఇప్పుడు మృతదేహాలను గుర్తించాలంటే.. డీఎన్ఏ పరీక్షలు మాత్రమే మార్గంగా ఉన్నాయి. అయితే.. ముస్లింలు ఎంతో ఖర్చును భరించి ఉమ్రా, హజ్ యాత్రలు చేస్తుంటారు.
అలాంటి పరిస్థితుల్లో డీఎన్ఏ పరీక్షల కోసం మృతుల సంబంధీకులు సౌదీ వరకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్న విషయమే..! అయితే.. ఇక్కడ ఓ వెసులుబాటు ఉందని సౌదీలో పనిచేస్తున్న భారతీయులు చెబుతున్నారు. మన ప్రభుత్వాలు సౌదీ సర్కారును సంప్రదిస్తే.. మన దగ్గర ఉండే సౌదీఅరేబియా ఎంబసీ అధికారులు ఇక్కడే డీఎన్ఏ పరీక్షలు జరిపించి, వాటి నివేదికలను సౌదీకి పంపే అవకాశాలున్నాయంటున్నారు. సౌదీలో మరణించిన భారతీయుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది.
అక్కడే అంత్యక్రియలు?
ముస్లింల పంచసూత్రాల్లో రోజుకు ఐదుపూటలా నమాజు చేయడం, రంజాన్ మాసంలో ఉపవాసాలు, పేదలకు దానాలు(జకాత్)తోపాటు.. మక్కా యాత్ర కూడా ఒకటి. సౌదీ అరేబియాలోని మక్కా, మదీనాలను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా అత్యంత పవిత్ర ప్రదేశాలుగా భావిస్తారు. అక్కడ మృతిచెందితే.. అది జన్నత్(స్వర్గం)కు మార్గంగా భావిస్తారు. ‘‘మక్కా యాత్ర సందర్భంగా అరాఫత్ పర్వతం వద్ద జరిగే తొక్కిసలాటలో ఎవరైనా మరణిస్తే.. మృతుల కుటుంబీకులు ఇక్కడే ఖననం చేయాలని నిర్ణయిస్తారు.
90% మంది భావన ఇదే. నాకు తెలిసి.. గత మక్కా యాత్ర సందర్భంగా మృతిచెందిన వారిలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మృతదేహాలను వేర్వేరు దేశాలకు తరలించారు’’ అని సౌదీలో ఉంటున్న కరీంనగర్ వాసి ఒకరు తెలిపారు. మదీనా సమీపంలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో.. బంధుమిత్రులు మిగిలిన అవశేషాలను సౌదీలోనే ఖననం చేసే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘సౌదీలోనే ఖననం చేయాలంటే.. మృతుల బంధుమిత్రులు ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. సౌదీ అధికారులు ఖననం చేయవచ్చంటూ ఇక్కడి ప్రొఫార్మాలో సమ్మతిపత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది. ప్రభుత్వమే అన్ని లాంఛనాలతో ఖననాలు జరుపుతుంది’’ అని ఆయన వివరించారు.


