
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్ జుబేర్ ఉన్నట్టుండి భారత్‌లో ప్రత్యక్షమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ జరిపిన సైనిక దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా మంత్రి అప్రకటిత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
చెప్పాపెట్టకుండా భారత్ వచ్చిన అదెల్ అల్ జుబేర్ గురువారం న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలిశారు. సౌదీ అరేబియా వాతావరణ రాయబారి కూడా అయిన అదెల్ అల్ జుబేర్ తనను కలిసినట్లు జైశంకర్ నుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ ఉదయం సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్ జుబేర్‌తో మంచి సమావేశం జరిగింది" అని ఆయన అన్నారు.
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది చోట్ల ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుధవారం భారత్ జరిపిన సైనిక దాడులను ప్రస్తావిస్తూ ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవడంపై భారత్ దృక్పథాలను సౌదీ మంత్రితో పంచుకున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో ద్వైపాక్షిక జాయింట్ కమిషన్ సమావేశానికి సహ అధ్యక్షత వహించేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి బుధవారం అర్ధరాత్రి న్యూఢిల్లీకి చేరుకున్న కొద్ది గంటల్లోనే జైశంకర్ తో సౌదీ మంత్రి భేటీ కావడం గమనార్హం.
A good meeting with @AdelAljubeir, Minister of State for Foreign Affairs of Saudi Arabia this morning.
Shared India’s perspectives on firmly countering terrorism.
🇮🇳 🇸🇦 pic.twitter.com/GGTfItZ3If— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 8, 2025