Ronaldo: ఏడాదికి రూ. 2000 కోట్లు, ప్రైవేట్‌ జెట్‌.. ఇంకా..! | Cristiano Ronaldos New Al-Nassr Contract: Rs 2000 Crore Per Year says Reports | Sakshi
Sakshi News home page

Cristiano Ronaldo: ఏడాదికి రూ. 2000 కోట్లు, ప్రైవేట్‌ జెట్‌.. ఇంకా..!

Jun 27 2025 12:48 PM | Updated on Jun 27 2025 1:48 PM

Cristiano Ronaldos New Al-Nassr Contract: Rs 2000 Crore Per Year says Reports

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo).. సౌదీ అరేబియాకు చెందిన ఫుట్‌బాల్‌ క్లబ్ అల్-నాస్ర్‌తో  తెగ‌దింపులు చేసుకున్నాడ‌న్న వార్త‌లకు తెర‌ప‌డింది. అల్-నాస్ర్ క్ల‌బ్ త‌ర‌పున‌ మ‌రో రెండేళ్ల పాటు ఆడేందుకు రొనాల్డో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ విష‌యాన్ని అల్-నాస్ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. క్రిస్టియానో ​​రొనాల్డో 2027 వరకు అల్-నాస్ర్ ఫుట్‌బాల్ క్ల‌బ్‌లో కొన‌సాగ‌నున్నాడు అని ఎక్స్‌లో రాసుకొచ్చింది. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రొనాల్డో.. 2022 డిసెంబ‌ర్‌లో అల్-నాస్ర్ క్ల‌బ్‌తో జ‌త‌క‌ట్టాడు.

గత రెండు సీజన్లలో సౌదీ ప్రో లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన  ​​రొనాల్డో, టైటిల్‌ను మాత్రం గెలుచుకోలేక‌పోయాడు. దీంతో ఈ పోర్చుగ‌ల్ కెప్టెన్ అల్ నాస్ర్‌కు వీడ్కోలు ప‌లికి వేరో క్ల‌బ్‌తో జ‌త‌క‌ట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు వార్త‌లు వినిపించాయి. కానీ అల్ నాస్ర్ క్ల‌బ్ యాజమాన్యంతో చ‌ర్చ‌లు అనంత‌రం రొనాల్డో త‌న నిర్ణ‌యాన్నిమార్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే సౌథీ ఫుట్‌బాల్ క్ల‌బ్‌తో త‌న కాంట్రాక్ట్‌ను రెండేళ్ల పాటు పొడిగించుకున్నందుకు రోనాల్డో భారీ మొత్తాన్ని అందుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

రొనాల్డోకు కళ్లే చెదిరే ఆఫర్‌..?
👉టాక్ స్పోర్ట్ రిపోర్ట్ ప్రకారం.. అల్ నాస్ర్ క్ల‌బ్ నుంచి రోనాల్డో ఏడాదికి 178 మిలియన్ పౌండ్లు(భార‌త క‌రెన్సీలో సుమారు. రూ.2000 కోట్లు) పారితోషికంగా తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. అదేవిధంగా మిగితా బెన్‌ఫిట్స్ కూడా రోనాల్డోకు ఉండ‌నున్నాయి.

👉సైనింగ్ బోనస్ కింద అతడికి తొలి ఏడాది 24.5 మిలియన్ పౌండ్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 261 కోట్లు) అందుకోనున్నాడు.

👉రెండో ఏడాదికి బోనస్ నగదు 30 మిలియన్ పౌండ్లు(రూ. 405 కోట్లు)కు పెరగనుంది.

👉అల్ నాస్ర్ ఆసియా ఛాంపియన్స్ లీగ్ గెలిస్తే 5 మిలియన్ పౌండ్లు(రూ.53.4 కోట్లు) బోనస్ లభించ‌నుంది.

👉సౌదీ ప్రో లీగ్ ఛాంపియన్‌గా అల్ నాస్ర్ గెలిస్తే రొనాల్డోకు 8 మిలియన్ పౌండ్లు(రూ. 85 కోట్లు) బోన‌స్ ల‌భించ‌నుంది.

👉గోల్డెన్ బూట్ గెలిస్తే రోనాల్డోకు 4 మిలియ‌న్ పౌండ్ల(రూ. 42 కోట్లు) బోన‌స్ ద‌క్క‌నుంది.

👉అల్‌నాస్ర్‌లో ఓన‌ర్‌షిప్ నుంచి 15 శాతం(అంచ‌నా ప్ర‌కారం 33 మిలియ‌న్ పౌండ్లు) రొనాల్డో ఖాతాలో చేర‌నుంది.

👉అదేవిధంగా ప్ర‌తీ గోల్‌కు రొనాల్డోకు 80వేల ఫాండ్లు(భార‌త క‌రెన్సీలో సుమారు 85 ల‌క్ష‌లు) న‌గ‌దు బ‌హుమ‌తిగా ద‌క్క‌నుంది. ఈ బోన‌స్‌ రెండో ఏడాదికి 20 శాతం పెర‌గ‌నుంది.
👉 ప్రైవేట్‌ జెట్‌ ఖర్చులు కూడా అల్-నాస్ర్‌ క్లబ్‌ భరించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement