
ఇవాళ మనిషి దగ్గర అన్నీ ఉంటున్నాయి... నవ్వు తప్ప. వేయి తుఫాన్లు చుట్టుముట్టినా హాయిగా నవ్వగలిగే, నవ్వించగలిగేవాళ్లు వాటిని దాటుతారు. స్నేహాలు, కుటుంబ అనుబంధాలు పలుచబడి ఒత్తిడి నిండిన ఈ రోజుల్లో నవ్వు సిరిధాన్యాల బలం ఇవ్వగలదు.జూలై 1‘ఇంటర్నేషనల్ జోక్ డే’. స్త్రీలకు నవ్వు ఇష్టం. ఇంట్లో, పని చోటా నవ్వుకోగలిగే వాతావరణం ఇష్టం. కాని వారిని టార్గెట్ చేస్తూ ఇంకా కొనసాగుతున్న కుళ్లు జోకులను మాత్రం ‘ఇక ఆపండి’ అంటున్నారు. ఆరోగ్యకరమైన హాస్యమే ఆనందోబ్రహ్మ.
జోకులు ఎవరు పుట్టిస్తారో ఎవరికీ తెలియదు. ప్రసిద్ధ రచయిత కుష్వంత్ సింగ్ పుస్తకాలు రాయడమే కాదు బాగా చదువుతాడు. హాస్యప్రియుడు. ఆయనకు ఒక సందేహం వచ్చింది. ఇంగ్లిష్‌లో ప్రచారంలో ఉన్న చాలా జోకులు కొద్ది΄ాటి తేడాలతో చాలా దేశాల్లో జనం చెప్పుకోవడం ఆయన గమనించాడు. ఈ జోకులు అన్ని దేశాల్లో చెప్పుకుంటున్నారు... చిన్న మార్పులతో... ఒరిజినల్‌గా ఎవరు సృష్టించి ఉంటారు అని చిన్న పరిశోధన చేస్తే చివరకు ఏం తెలిసిందో తెలుసా? అవన్నీ యూదులు తయారు చేసిన జోకులు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో భయం, ఒత్తిడిలో, తమపై ఊచకోత సాగుతున్న సమయంలో వారు ఆ దుఃఖాన్ని మర్చి΄ోవడానికి జోకులు సృష్టించుకుని నవ్వుకునేవారట. అవే ఆ తర్వాత అన్ని దేశాలకు రూపు మార్చుకుని చేరాయి.
ఒక్క నవ్వు చాలు వేయి వరహాలు అంటారు మనవారు. నవ్వు రూపానికో అలంకారం మాత్రమే కాదు సంస్కారానికి ఆనవాలు కూడా. చిర్నవ్వు ధరించిన ప్రతి మనిషి సౌందర్యంతో ఉన్నట్టే. ఫ్రీ మేకప్. అంతా కలిపి చేయాల్సింది నవ్వుతూ పెదాలను సాగదీయడమే.
నవ్వులో విశేషం ఏమిటంటే బలవంతంగా నవ్వినా, ఏడ్చినట్టు నవ్వినా ఆ నవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుందట. ఇక నిజంగా నవ్వితేనో? అందుకే సినీ దర్శకుడు నవ్వడం భోగం... నవ్వించడం యోగం అన్నాడు. జోకులకు ఉండే శాపం ఏమిటంటే అవి విన్నప్పుడు నవ్వొస్తాయి... తర్వాత గుర్తుండవు. ఒక జోకు చెప్పు అని ఎవర్ని అడిగినా వెంటనే బుర్ర తడుముకుంటారు. జోకులు ఎందుకు గుర్తుండవనేది పెద్ద పజిల్.
ఇవాళ రేపు స్టాండప్ కమెడియన్లు చాలా సక్సెస్ అవుతున్నారు. రాజకీయ నాయకుల మీద జోకులు వేస్తున్నారు. అలా జోకులేసే కమెడియన్లపై రాజకీయ నాయకులు కూడా సెటైరికల్‌గా పగబడుతున్నారు. ‘ఇతరులు మన మీద జోకేస్తే నవ్వేవాడు భోగి... తన మీద తనే జోకేసుకునేవాడు యోగి’ అన్నాడో జోకుల రీసెర్చర్ వెనుకటికి. జోకు వింటే వచ్చే నవ్వుకు జెండర్ ఉండదు. స్త్రీలు, పురుషులు సమానంగా నవ్వుతారు. కాని జోకులో సబ్జెక్ట్‌కు జెండర్ ఉంటుంది.
ఆడవాళ్ల మీద వేసే జోకు అన్నింటి కంటే అథమమైనది. అయినా సరే అప్పడాల కర్రల మీద, వారి అలంకరణల మీద, అలవాట్ల మీద జోకులు వేసి ఇకఇకలు ΄ోతుంటారు చాలామంది. భార్య తోడు లేకపోతే గంట కూడా బతకలేని భర్త నలుగురు ఫ్రెండ్స్ రాగానే భార్య మీద జోకులేస్తాడు. భార్యను నవ్వించొచ్చు. నవ్వులాటగా మార్చకూడదు. అయినా సరే స్త్రీల మీద చీప్ జోకులు వినపడుతూనే ఉన్నాయి. ఒక మనిషిని కించపరిచేది జోక్ కాదు. మంచి జోక్ పేల్చడం ఉదాత్తమైన కళ. ఇంటర్నేషనల్ జోక్ డే సందర్భంగా నవ్వుల శుభాకాంక్షలు. నవ్వుతూ బతుకుదాం.