
డొనాల్డ్ ట్రంప్.. రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తన ఆధిపత్యాన్ని ప్రతీ చోట చూపించాలనే అనుకుంటున్నారు. ప్రపంచ దేశాల ముందు తాము అగ్రరాజ్యాధినేతలమనే ‘కటింగ్’ కాస్త ఎక్కువగానే ఉంది. తమది అగ్రరాజ్యం.. తాను అగ్రజున్ని అనే ఫీలింగ్ ఆయనలో ఎక్కువగా ఉంది.తాను ఏది చెబితే అది శాసనం అన్న చందంగా తయారైంది ట్రంప్ పరిస్థితి.
ఈ క్రమంలోనే తనకు ఆప్తులు, అత్యంత సన్నిహితులు అనే వారిని కూడా వదులుకుంటున్నారు. ఇటీవల తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఎలాన్ మస్క్‌తో వైరం తెచ్చుకున్నారు. ‘బిగ్ బ్యూటీఫుల్’ బిల్ విషయంలో మస్క్ నో చెప్పారని ట్రంప్ విరుచుకుపడ్డారు. మస్క్‌ను బహిరంగంగానే చెడామడా తిట్టిపోశారు.
మస్క్ దక్షిణాఫ్రికా( మస్క్ జన్మస్థలం) వెళ్లిపోవాలనుకుంటున్నారా? అనే వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దానిలో భాగంగానే మస్క్ నుంచి ‘కొత్త పార్టీ’ అంటూ ఓ ప్రకటన కూడా వెలువడింది. ఫలితంగా మస్క్‌తో ట్రంప్ సంబంధాలు దాదాపు తెగిపోయాయనే చెప్పొచ్చు.
ఆ తర్వాత పుతిన్‌తో కూడా ట్రంప్‌కు మంచి సాన్నిహిత్యమే ఉంది. దీనిలో భాగంగానే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని క్షణాల్లో ఆపేస్తానని ప్రకటించేశారు ట్రంప్. తాను ఆఫీస్‌లో కూర్చొనే 24 గంటల్లో ఇరుదేశాల యుద్ధాన్ని ముగిస్తానని చెప్పిన ట్రంప్.. ఆపై ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్ స్కీతో చర్చలు కూడా జరిపారు.
స్వయంగా జెలెన్ స్కీని వైట్‌హౌస్‌కు పిలిపించి మరీ చర్చించారు ట్రంప్. ఇక్కడ ట్రంప్ వ్యవహారాలి శైలిపై వైట్‌హౌస్ వేదికగానే మీడియా ముందే జెలెన్ స్కీ రెచ్చిపోయి మాట్లాడారు. ఇక్కడే ట్రంప్ పరువు సగం పోయింది. ‘యుద్ధం ఆపాలనుకుంటే రష్యాకు ముందు చెప్పండి.. వార్ ప్రారంభించిది పుతిన్’ అంటూ జెలెన్ స్కీ ఘాటుగా స్పందించారు. ఇలా అమెరికా అధ్యక్షుడి ముందు మరొక దేశాధినేత ఇంత ఘాటుగా మాట్లాడటంతో జెలెన్ స్కీ హీరో అయిపోయాడు. ఇక్కడ ట్రంప్ పాత్రకు అసలు అర్థం లేకుండా పోయింది.
పుతిన్‌తో కటీఫ్..?
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాన్ని పుతిన్ సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. ట్రంప్ ఫోన్ చేసి చెప్పినప్పుడు ఓకే అంటున్న పుతిన్.. అపై గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాడు. ట్రంప్ మధ్యవర్తిత్వం తర్వాత ఉక్రెయిన్-రష్యాల యుద్ధం మరింత ఉగ్రరూపం దాచ్చిందనే చెప్పాలి. దాంతో పుతిన్‌తో ట్రంప్ బ్రొమాన్స్ ముగిసిపోయినట్లే కనబడుతోంది.
వందల కొద్దీ డ్రోన్స్, మిసెల్స్‌తో ఉక్రెయిన్‌పై దాడికి దిగుతున్నారు పుతిన్. దాంతో ట్రంప్‌లో అసహనం ఎక్కువైపోతోంది. ‘పుతిన్ అంతే.. మారడు.. చంపుతూనే ఉంటాడు’ అనే వ్యాఖ్య కూడా చేశారు ట్రంప్. ఈ క్రమంలోనే పుతిన్‌పై నోరు పారేసకున్నారు. వాషింగ్టన్ మీడియా వేదికగా పుతిన్‌పై రెచ్చిపోయి మాట్లాడారు. పుతిన్ మంచి వ్యక్తి అనుకున్నా.. కానీ ఇప్పుడు అర్థం పర్థం లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ ట్రంప్ ధ్వజమెత్తారు.
ఉక్రెయిన్‌కు ‘యుద్ధ సాయం’ హామీ
రష్యాతో సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని కొన్ని రోజుల క్రితం ట్రంప్ పేర్కొన్నారు. తమ రక్షణ వ్యవస్థలోని ప్రధాన వనరులను అవసరమైతే కీవ్‌కు పంపిస్తామనే హామీ కూడా ఇచ్చారు. ఇదంతా పుతిన్‌పై తీవ్ర కోపం లోలోలన రగిలిపోతున్న ట్రంప్ చెప్పిన మాటలు. అంటే పరోక్షంగా రష్యాపై తాము యుద్ధానికి దిగుతామనే హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. ఇది పుతిన్‌తో ట్రంప్‌కు చెడిపోయిందనడానికి మరింత బలం చేకూర్చింది.
ట్రంప్ యూ టర్న్..
ఉక్రెయిన్‌కు యుద్ధం విషయంలో అండగా ఉంటామని ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు నూతన ఆయుధాలు సమకూర్చేందుకు అమెరికా ‘జీరో డాలర్లు’ ఖర్చు చేస్తుందని, అందుకు అయ్యే ఆర్థిక భారాన్ని యూరోపియన్ యూనియన్(ఈయూ) మోయాల్సి ఉంటుందన్నారు.
ఉక్రెయిన్‌కు రాబోయే కాలంలో పంపించే ఆయుధాల బిల్లును అమెరికా భరించబోదని, ఆ ఆర్థిక బాధ్యత ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌పైనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇది ఉక్రెయిన్‌కు పిడుగులాంటి భారం.
రష్యాతో యుద్ధంలో అమెరికాపైనే ఎక్కువ ఆధారపడుతున్న ఉక్రెయిన్.. ట్రంప్ యూ టర్న్‌తో ఒక్కసారిగా కంగుతింది. ఇక్కడ ఆయుధాల్ని అమ్ముకోవడమే తమ పని అనే విషయం ట్రంప్ వైఖరితో మరోసారి వెల్లడైంది. ఇక్కడ ఉక్రెయిన్‌కు యుద్ధం విషయంలో ట్రంప్ యూ టర్న్ తీసుకోకుండా ఆర్థిక భారాన్ని యూరోపియన్ యూనియన్ దేశాలపైకి నెట్టారు. అంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి అవసరమయ్యే ఆర్థిక భారాన్ని మోస్తే తాను ఆయుధాల్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ట్రంప్ వైఖరిపై ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా చేయని పుతిన్.. ఏం జరుగుతుందో చూద్దాం అనే ధోరణితోనే ఉన్నారు.