
ఉక్రెయిన్ సంక్షోభంలో.. పుతిన్ వైఖరి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ విధానాలు తనకేమాత్రం నచ్చడం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. ఈ ఇద్దరు దేశాధినేతలు తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటుండడం తెలిసిందే.
రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరి పట్ల నేను తీవ్ర నిరాశ చెందారు. పుతిన్ శాంతి కోసం మాట్లాడతారని అనుకున్నాను. కానీ రాత్రికి రాత్రి ఉక్రెయిన్‌పై దాడులు చేయిస్తున్నారు. ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు అని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి పుల్‌స్టాప్ పెట్టే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడితే.. పుతిన్-జెలెన్‌స్కీ వైఖరి వల్ల నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. దీంతో ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు. పైగా ట్రంప్-పుతిన్‌లు తరచూ ఈ అంశంపై ఫోన్‌లో మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే.
రష్యాపై ఆంక్షలు?
రష్యాపై కొత్త ఆంక్షలు విధించే అవకాశాన్ని ట్రంప్ సూచన ప్రాయంగా తెలియజేశారు. మేము రేపు ఏం చేస్తామో చూడండి అంటూ మీడియాతో వ్యాఖ్యానించారాయన. అమెరికా సెనేటర్లు ఇప్పటికే రష్యాపై ‘స్లెడ్జ్‌హామర్’(కఠినమైన) ఆంక్షల బిల్లును ప్రతిపాదించిన సమాచారం. పైగా ఈ బిల్లు రష్యా విషయంలో ఆంక్షలు విధించేందుకు ట్రంప్‌కు విస్తృత అధికారాలను కల్పించనుందని తెలుస్తోంది.
తాజా వ్యవహారంతో ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరీముఖ్యంగా అమెరికా-రష్యా సంబంధాల్లో కీలక మలుపుగా భావించబడుతున్నాయి. ట్రంప్ మాటలు, చర్యలు.. ఉక్రెయిన్ ఉద్రిక్తతల్లో రష్యాపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను అందించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు ఇది ఎంతో అవసరమని అని ఆయన.. ఈ ఆయుధాల ఖర్చును అమెరికా భరించదని, యూరోపియన్ యూనియన్ 100% చెల్లించనుందని తెలిపారు.ఈ క్రమంలో ఇది జస్ట్ బిజినెస్ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.