
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూతురు డాక్టర్ సైమా వాజెద్(Saima Wazed) చిక్కుల్లో పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్-ఈస్ట్ ఏషియా ప్రాంతానికి(SEARO) ఆమె రీజియనల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సంగతి తెతలిసిందే. అయితే సొంత దేశంలో అవినీతి ఆరోపణలు వెల్లవెత్తడంతో.. డబ్ల్యూహెచ్‌వో ఆమెను నిరవధిక సెలవులపై పంపింది.
ఇప్పటికే భారత్‌లో ఆశ్రయం పొందిన షేక్ హసీనాపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పలు అభియోగాలను నమోదు చేసింది. అయితే తాజాగా ఆమె తనయ సైమా వాజెద్‌పైనా అవినీతి కేసులు నమోదు చేసింది. దీంతో ఆమెను సెలవులపై పంపించిన డబ్ల్యూహెచ్‌వో.. సైమా స్థానంలో డాక్టర్ కాథరినా బూమీ ఇన్‌ఛార్జిగా కొనసాగుతారని వెల్లడించింది. అయితే ఆమె సెలవుల వ్యవహారంపై ప్రశ్న ఎదురుకాగా.. అదనంగా స్పందించేందుకు డబ్ల్యూహెచ్‌వో నిరాకరించింది.
డబ్ల్యూహెచ్‌వో నిర్ణయంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిసిన ఓ అధికారి.. ఆమెను శాశ్వతంగా తప్పించాలని ఐక్యరాజ్య సమితి విభాగానికి విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే.. డబ్ల్యూహెచ్‌వో రీజీయనల్ ఆఫీస్ న్యూఢిల్లీలోనే ఉంది. కాథరినా జులై 15వ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. సైమా వాజెద్‌పై అధికార దుర్వినియోగం, ఫోర్జరీ, ఫ్రాడ్ కేసులను బంగ్లాదేశ్ యాంటీ కరప్షన్ కమిషన్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.
1972 డిసెంబర్ 9న డా. ఎం.ఎ. వాజేద్ మియా (న్యూక్లియర్ సైంటిస్ట్), షేక్ హసీనా దంపతులకు సైమా వాజెద్ జన్మించారు. ఫ్లోరిడా(అమెరికా) బ్యారీ యూనివర్సిటీలో ఆమె సైకాలజీలో డిగ్రీ, పీజీ చేశారు. ఆర్గనైజేషనల్ లీడర్‌షిప్‌లో డాక్టరల్ చేశారు. స్కూల్ సైకాలజీలో స్పెషలిస్ట్ అయిన ఆమె.. ఆటిజం, మానసిక ఆరోగ్యంపై ఆమె చేసిన ప్రచారాలు అంతర్జాతీయ స్థాయిలో మార్పులకు దారితీశాయి. డబ్ల్యూహెచ్‌వో ఆమె నేతృత్వంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఆమె భర్త ఖండకర్ మస్రూర్ హుస్సేన్ మితు. ఈయనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఈ జంటకు నలుగురు పిల్లలు. అయితే వీళ్లు విడిపోయారంటూ ఆ మధ్య ప్రచారం జరిగినా.. అధికారికంగా ఇద్దరిలో ఎవరూ ఖండించకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: టారిఫ్ వార్‌లో వెనక్కి తగ్గిన ఈయూ?