బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా (Sheikh Hasina) మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు సంబంధించి బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించడంతో ఆమె వార్తల్లో నిలిచింది. హసీనాను దోషిగా నిర్ధారించిన కోర్టు తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో హసీనా కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా భర్త డా.ఎం.ఎ. వాజెద్ మియా (Wazed Miah) గురించి తెలుసుకుందాం.
షేక్ హసీనా పుట్టుక
1947 సెప్టెంబరు 28న పాకిస్థాన్‌లోని తుంగిపారాలో షేక్ హసీనా జన్మించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, తొలి అధ్యక్షుడు జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఆమె తండ్రి. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేది. హసీనా ఢాకా విశ్వవిద్యాలయం నుంచి బెంగాలీ సాహిత్యంలో హసీనా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1968లో అణు శాస్త్రవేత్త ఎం.ఎ.వాజెద్ మియాను వివాహం చేసుకున్నారు. వీరికి సజీబ్ వాజెద్ జాయ్ అనే కొడుకు, సైమా వాజెద్ పుతుల్ అనే కుమార్తె ఉన్నారు.
2004 ఆగస్టులో దేశ రాజధాని ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీపై గ్రెనేడ్ దాడినుంచి తృటిలో తప్పించుకుంది హసీనా. 2006-2008 రాజకీయ సంక్షోభం మధ్య, హసీనా దోపిడీ ఆరోపణలపై అరెస్టైంది. విడుదలైన తర్వాత 2008 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 2014, 2018 ఎన్నికల్లోనూ అవామీ లీగ్ పార్టీని గెలిపించి ప్రధానిగా ఎన్నికై, ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన మహిళా నేతల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన ఘనతను దక్కించుకుంది హసీనా. 2024లో స్వాతంత్య్ర పోరాట వీరుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం సందర్భంగా అల్లర్లు, విద్యార్థులపై అణచివేత, హింస ఆరోపణల కారణంగా ఆమెను నిరంకుశ నేతగా, దోషిగా పేర్కొంటూ కోర్టు మరణ శిక్ష విధించింది.
ఉక్కు మహిళగా, తిరుగులేని నేతగా
తన తండ్రి స్థాపించిన రాజకీయ పార్టీ అయిన అవామీ లీగ్‌ను నడిపించి, దశాబ్దాల పాటు బంగ్లాదేశ్‌ను రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్న ‘ఉక్కు మహిళ’ గా పేరుగాంచిన హసీనా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది. తిరుగులేని నాయకురాలిగా నిలిచింది. ప్రతిపక్ష నాయకురాలిగా కూడా ప్రజాస్వామ్యం గొంతుకగా మారింది. పలు సార్లు గృహనిర్బంధాన్ని కూడా ఎదుర్కొంది. విద్యార్థి ఉద్యమం చిలికి చిలికి గాలివానలా ముదిరి బంగ్లాదేశ్‌లో అశాంతి నెలకొంది. అది చివరికి హసీనాను పదవి నుండి తొలగించే స్థాయికి చేరింది. దీంతో 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ నుండి పారిపోయి అప్పటి నుండి భారతదేశంలో తలదాచుకుంది.
ఎవరీ ఎంఏ వాజెద్ మియా
హసీనా భర్త వాజెద్ మియా సైన్స్ రంగంలో చాలా ప్రభావవంతమైన వ్యక్తి. తన కెరీర్ మొత్తంలో, అనేక ప్రభావవంతమైన పుస్తకాలను ప్రచురించారు. అణుశాస్త్రవేత్తగా ఎంతో కృషి చేశారు. 1942, ఫిబ్రవరి 16న రంగ్‌పూర్‌లోని పిర్గంజ్‌లో జన్మించారు వాజెద్ మియా. ఈయనను ప్రేమగా 'సుధా మియా' అని పిలుస్తారు. రంగ్‌పూర్‌లో విద్యను పూర్తి చేసిన తర్వాత, వాజెద్ మియా భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలు పొందారు , రెండింటిలోనూ టాప్‌గా నిలిచారు. తరువాత ఇంపీరియల్ కాలేజ్ లండన్ నుండి డిప్లొమా , UK లోని డర్హామ్ విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో PhD పొందారు.

1963లో, మియా పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్‌లో ఉద్యోగంలో చేరారు. ఇటలీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియొరెటికల్ ఫిజిక్స్‌లో అసోసియేట్‌షిప్ తర్వాత, మియా పాకిస్తాన్‌కు తిరిగి వచ్చాడు. అనంతరం కరాచీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ప్రధాన శాస్త్రవేత్తగా చేరారు. అయితే, అతని భద్రతా అనుమతి రద్దు చేయడంతో అతను బంగ్లాదేశ్‌కు వలస వెళ్ళాడు.
బంగ్లాదేశ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్‌గా
బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన తర్వాత, మియాబంగ్లాదేశ్ అటామిక్ ఎనర్జీ కమిషన్‌లో గణనీయ మైన సేవలందించారు. వాటిలో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ , బంగబంధు షేక్ ముజిబ్కే ఘైర్ కిచ్చు ఘటానా ఓ బంగ్లాదేశ్ ఉన్నాయి. తరువాత బంగ్లాదేశ్ అణుశక్తి కమిషన్ ఛైర్మన్ అయ్యాడు. 1999లో పదవీ విరమణ చేశాడు.
వాజెద్ మియా అరెస్టు
ఢాకా విశ్వవిద్యాలయంలో ఉన్న సమయంలో, వాజెద్ మియా రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు.. 1961 నుండి 1962 వరకు,ఫజ్లుల్ హక్ ముస్లిం హాల్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు.అయితే 1962 తూర్పు పాకిస్తాన్ విద్యా ఉద్యమంలో పాల్గొన్నందుకు కూడా అతను అరెస్టు అయ్యాడు. కాలేజీ రోజుల్లో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ, విశ్వవిద్యాలయం తర్వాత అతను రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.
వాజెద్ మియా - షేక్ హసీనాల వివాహం
1967 నవంబర్ 17న వాజెద్ మియాను వివాహం చేసుకుంది హసీనా. అప్పటికి బంగ్లాదేశ్‌లోని ప్రతికూల రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ వివాహం చాలా సన్నిహితంగా జరిగింది.
ఇదీ చదవండి: మరణ శిక్ష : మాజీ ప్రధాని షేక్ హసీనా తొలి స్పందన
మామగారి బహుమతిని అపురూపంగా
వివాహ సమయంలో, హసీనా తండ్రి రెహమాన్ జైలులో ఉన్నారు. దీంతో జైలులోంచే కొత్త జంటను ఆశీర్వదించిన ఆయన తన అల్లుడు వాజెద్‌కు రోలెక్స్ గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు. దానిని వాజెద్ తన జీవితాంతం విలువైన ఆస్తిగా, అపురూపంగా దాచుకున్నాడట.
వాజెద్ మియా అస్తమయం
రాజకీయ కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ, షేక్ ముజిబుర్ రెహమాన్ అల్లుడు లేదా షేక్ హసీనా భర్త అని అతను ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అణు శాస్త్రవేత్తగా వాజెద్ తన తెలివితేటలతో ప్రత్యేకంగా నిలిచాడు. అయితే తీవ్ర గుండె సమస్యలతో పాటు మూత్రపిండ వైఫల్యం, మధుమేహం, ఉబ్బసం , అధిక రక్తపోటుతో బాధపడుతూ 66 ఏళ్ల వయసులో వాజెద్ 2009లో కన్నుమూశాడు. గొప్ప అణు శాస్త్రవేత్తగా మియా అందించిన సేవలను గొప్పగా, నిత్యం ప్రకాశించే లైట్‌హౌస్‌గా భావిస్తారు.


