సాక్షి,హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ విద్యానగర్‌కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది సభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందారు. దీంతో విద్యానగర్ ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి.
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదం నసీరుద్దీన్ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. నసీరుద్దీన్‌తో సహా అతని కుమారులు, కూతుళ్లు, కోడళ్లు, మనవళు, మనవరాళ్లు ఇలా వారి కుటుంబానికి చెందిన మూడు తరాలవారు ఈ ప్రమాదంలో మృతిచెందారు. దీంతో వారి బంధువులు తీవ్రంగా విలపిస్త్నున్నారు.
నసీరుద్దీన్ తమతో ఎంతో బాగా ఉండేవారని మక్కా వెళ్లి వస్తానన్న కుటుంబసభ్యులు ఇలా అకాల మరణం చెందడం తమను ఎంతో కలిచి వేస్తోందని బాధపడుతున్నారు.సౌదీ అరేబియాలో మదీనా నుంచి మక్కా వెళుతున్న సమయంలో బస్సుప్రమాదం జరిగి 45 మంది మృతిచెందారు. వారిలో 18 మంది నసిరుద్దీన్ కుటుంబ సభ్యులున్నారు.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నసీరుద్దీన్ కుటుంబ సభ్యులందరికీ సౌదీలోనే అంత్యక్రియలు నిర్వహించాలని వారి బంధువులు నిర్ణయించినట్లు సమాచారం. అంత్యక్రియలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


