పట్నా:ఒకపుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రి కిడ్నీ దానం చేసి వార్తల్లో నిలిచిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఇపుడు మరోసారి సంచలనంగా మారారు.బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఇలా వెలువడ్డాయో లేదో, తన కుటుంబంతో సంబంధాలను తెంచుకుని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు లాలూ కుటుంబంపై ఆర్జేడీ నేత రోహిణీ ఆచార్య పలు ఆరోపణలు చేశారు. మరోవైపు టికెట్ కోసం ‘డర్టీ కిడ్నీ’రాజకీయాలు అంటూ కుటుంబసభ్యులు ఆమెపై మండిపడ్డారు. అసలే ఓటమి భారంతో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు రచ్చకెక్కడం ఆర్జేడీకి పెద్ద తలనొప్పిగా మారింది.
దీనిపై స్పందించిన రోహిణి తన భర్త, ముగ్గురు పిల్లల్ని చూసుకోవడం కంటే కిడ్నీ దానం చేసి తండ్రిని కాపాడుకోవడం మీదనే దృష్టిపెట్టడం తన పాపమైపోయిందని సోషల్ మీడియా పోస్ట్‌లో వాపోయింది. ఎవరూ తన లాంటి తప్పు చేయకూడదని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు రోహిణి కుటుంబం ఏమిటి, భర్త ఎవరనేది నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
రోహిణి ఆచార్య భర్త ఎవరు?
రోహిణి భర్త సమరేష్ సింగ్, కుమార్తె అనన్య ,ఇద్దరు కుమారులు ఆదిత్య , అరిహంత్‌లతో కలిసి సింగపూర్ నివసిస్తుంది. 2002లో సమరేష్ సింగ్‌తో రోహిణి వివాహం జరిగింది. ముంబైలో ఒకప్పుడు సీనియర్ ఆదాయపు పన్ను అధికారిగా పనిచేసిన దివంగత రణవిజయ్ సింగ్ కుమారుడే సమరేష్. పెళ్లి తరువాత రోహిణి, సమరేష్ జంట మొదట అమెరికాకు వెళ్లారు ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నారు. సమరేష్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో బిఎ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో మాస్టర్స్ ,INSEAD (ఇన్‌స్టిట్యూట్ యూరోపీన్ డి'అడ్మినిస్ట్రేషన్ డెస్ అఫైర్స్)బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ (ఫైనాన్స్) చేశారు. ప్రస్తుతం, సమరేష్ సింగపూర్‌లోని ఎవర్‌కోర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్,మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన గతంలో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లో సీనియర్ ఉద్యోగిగా పనిచేశారు.
(ఆర్బీఐ, సీబీఐ అంటూ.. 6 నెలల్లో రూ. 32 కోట్లు!)
కాగా మరోవైపు రోహిణికి బీజేపీ అండగా నిలవడం విశేషం. కుమార్తె నుంచి కిడ్నీ స్వీకరించి బతికి బట్ట కట్టిన లాలూ, కొడుకు తేజస్వికి అనుకూలంగా వ్యవహరించారంటూ తన విమర్శలను ఆర్జేడీపై ఎక్కుపెట్టింది. పార్టీలోని అరాచకమే కుటుంబంలో కూడా కనిపిస్తోందని బిహార్ ఉపముఖ్యమంత్రి విజయ్ సిన్హా కూడా యాదవ్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. తమ సొంత కుటుంబాన్నే ఐక్యంగా ఉంచుకోలేని వారు, ఇక రాష్ట్రాన్నేం పాలిస్తారంటూ ఎద్దేవా చేశారు.


