ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ ఐసీటీ(ఇంటర్నేషన్ క్రైమ్స్ ట్రిబ్యునల్) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. ఆందోళనకారుల్ని చంపాలని హసీనా ఆదేశించారని.. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.
‘‘హసీనా మానవత్వాన్ని మరిచారు. ఆందోళనకారుల్ని చంపాలని ఆదేశించారు. ఆమె చేతులు రక్తంతో తడిచాయి. చేసిన నేరంపై ఆధారాలు ఉన్నాయి. ఆమెకు మరణశిక్షే సరి’’ అని తీర్పు సందర్భంగా ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా వ్యవస్థను పునరుద్ధరించడాన్ని నిరసిస్తూ కిందటి ఏడాది జులైలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే.. ఆ ఆందోళనకు హింసాత్మకంగా అణచివేశారని హసీనాతో పాటు మరో ఇద్దరిపై(మాజీ హోం మంత్రి, మాజీ పోలీస్ చీఫ్) నేరారోపణలు నమోదు అయ్యారు. తీవ్ర నేరాల దృష్ట్యా ఆమెకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది.
విచారణ జరిపిన కోర్టు.. ‘‘బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి షేక్ హసీనానే. ప్రధాని పదవిలో ఉంటూ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఆందోళనకారుల్ని చంపాలని ఆమె ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే హెలికాప్టర్‌లను ఉపయోగించాలని భద్రతా బలగాలకు సూచించారు. అంతేకాదు.. 226 మందిని చంపాలంటూ తన అనుచరుడు షకీల్‌ను ఆమె ఆదేశించారు.
.. జులై 14వ తేదీన రాత్రి ఆమె ఢాకా వర్సిటీ వీసీకి ఫోన్ చేశారు. నిరసనకారుల్ని ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ‘ ఆ రజాకార్లను ఉరి తీస్తా. వాళ్లకు మద్దతుగా నిలుస్తున్నవాళ్లను కూడా చంపేస్తా. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు’’ అని ఆమె అన్నారు. తక్షణమే వాళ్లను అరెస్ట్ చేయించాలని వీసీకి ఆమె సూచించారు. విద్వేషపూరిత ప్రసంగాలతో విద్యార్థులను ఆమె రెచ్చగొట్టారు. ఆ సమయంలో కోర్టులు సైతం జోక్యం చేసుకున్నాయి. అలాంటి ప్రసంగాలు చేయొద్దని ఆమెను వారించాయి. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోయింది.
.. విద్యార్థులను ఆమె కిరాతకంగా చంపించారు. వాళ్ల మృతదేహాలను తగలబెట్టాలని పోలీసులను ఆదేశించారు. విద్యార్థి సంఘం నాయకుడు అబూ సయ్యద్ జులై 16న జరిగిన పోలీసుల కాల్పుల్లో మరణించారు. ఆ పోస్ట్‌మార్టం నివేదిక విషయంలోనూ భారీ అవకతవకలు జరిగాయి. ప్రభుత్వ వైద్యుడ్ని బెదిరించి ఐదుసార్లు ఆ నివేదికను హసీనా ప్రభుత్వం మార్పించింది.
.. ఆమెకు గరిష్ట శిక్ష(మరణశిక్ష) విధించాలని ప్రాసిక్యూషన్‌వాళ్లు కోరుతున్నారు. వాళ్లు సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తే ప్రపంచంలోని ఏ న్యాయస్థానమైన సరే ఆమెకు గరిష్ట శిక్షనే విధిస్తుంది అని బెంచ్‌లో ఓ న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.
తీర్పు నేపథ్యంలో.. ఢాకా ఆర్మీ భారీగా మోహరించింది. ఇప్పటికే అవామీ లీగ్ కార్యకర్తలు, హసీనా మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో హింస చెలరేగే అవకాశం ఉండడంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు.
అల్లా ఇచ్చిన జీవితం
తీర్పు వేళ.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా స్పందించారు. అవామీ లీగ్ శ్రేణులను ఉద్దేశించి ఓ ఆడియో విడుదల చేశారు. ఇది అల్లా ఇచ్చిన జీవితమని.. తనకు ఎలాంటి భయం లేదని.. దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఉందని.. ఇలాంటి తీర్పులు తననేం చేయలేవని అన్నారామె. తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని తోసిపుచ్చారు. అవామీ లీగ్ అనేది ప్రజల్లోంచి పుట్టిందని.. అలాంటి పార్టీని నాశనం చేయాలని తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అయితే అది అయ్యే పని కాదని.. ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెప్తారని హసీనా అన్నారు.


