సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ప్రమాద ఘటనపై రియాద్ లోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడానని అధికారులు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారన్నారు. ఘటన వివరాలు సేకరిస్తున్నామని హామీ ఇచ్చారని ఎంపీ అసదుద్దీన్ తెలిపారు.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45మంది హైదరాబాదీయులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై ఎంఐఏం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. "ఈ ఘటనపై రియాద్ లోని ఇండియన్ డిప్యూటీ చీఫ్ ఎంబసీతో మాట్లాడాను. ఈ ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తామని ఆయన నాకు హామీ ఇచ్చారు. అదే విధంగా ట్రావెల్ ఏజెన్సీలతో మాట్లాడి యాత్రికుల వివరాలు వారికి అందజేశాను" అని అన్నారు.
మృతుల పార్థివదేహాలను వీలైనంత త్వరగా భారత్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని భారత ప్రభుత్వానికి ఒవైసీ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని కోరారు. మరోవైపు సౌదీ అరేబియా బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈ విషయమై భారత అధికారులు సౌదీ అరెబీయా అధికారులతో సంప్రదిస్తున్నారని తెలిపారు.
భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ ఘటన తనను షాక్‌కు గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన సానూభూతి తెలిపారు. బాధితులకు రియాద్‌లోని ఇండియన్ ఎంబసీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు బస్సు అగ్నిప్రమాదానికి గురవగా అందులోని 45 మంది సజీవ దహనమయ్యారు. ఒక్కరు ప్రాణాలతో బయిటపడగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్లు సమాచారం. మృతులంతా హైదరాబాదీ వాసులే.


