ఎరుమేలిలో అభివృద్ధి పనులు ప్రారంభం
17 నుంచి పెద్దపాదం మార్గంలో భక్తులకు అనుమతి
సీజన్ ప్రారంభం నుంచే.. పులిమేడు మార్గం ఓపెన్
పథనంతిట్ట: శబరిమలలో మండల, మకరవిళక్కు సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు అభివృద్ధి పనులు, భక్తులకు మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారించారు. శబరియాత్రకు తొలిమెట్టుగా భావించే ఎరుమేలిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎరుమేలిలోని ధర్మశాస్తా ఆలయ ద్వారానికి రంగులు వేస్తున్నారు. అదేవిధంగా టీడీబీకి చెందిన భారీ పార్కింగ్ ప్రదేశంలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో ఈ పార్కింగ్ ప్రదేశంలో ఎలాంటి ఫ్లోరింగ్ ఉండేది కాదు. దాంతో.. చినుకు పడితే.. చిత్తడిగా మారిపోయేది. భక్తులు పాదరక్షలు లేని కాళ్లతో ఇక్కడ నడవడం ఇబ్బందిగా మారేది. వాహనాలు కూడా బురదలో కూరుకుపోవడం, స్కిడ్ అవ్వడం జరిగేది. ఈ సారి కేరళ ప్రభుత్వం శబరిమల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయడంతో.. వాహన పార్కింగ్ ప్రదేశంలో ఇంటర్‌లాక్ బ్లాకులతో ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తున్నారు.

ఎరుమేలి యాత్ర కీలకం
శబరిమల యాత్రికులు ఎరుమేలిని తొలుత దర్శించడం ఆనవాయితీగా వస్తోంది. పెద్దపాదం మార్గంలో వెళ్లేవారు.. ఎరుమేలి ధర్మశాస్తా ఆలయం నుంచే తమ యాత్రను ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి అలుదానది, అలుదామేడు. కరిమల కొండ మీదుగా పంపాబేస్ క్యాంప్‌నకు చేరుకుంటారు. ఇక పంపాబేస్ నుంచి చిన్నపాదం మార్గంలో నీలిమల మీదుగా శబరిమల సన్నిధానానికి వెళ్లే భక్తులు సైతం ఎరుమేలిని దర్శించుకుని, ఇక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో నీలక్కల్ శివాలయం మీదుగా పంపాబేస్‌కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, అధికారులు రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు. లోయలు, ప్రమాదకరమైన మలుపులు ఉన్నచోట రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా కంట్రోల్ రూమ్ ద్వారా రియల్‌టైమ్ ట్రాఫిక్‌ను పర్యవేక్షించేలా సన్నాహాలు పూర్తిచేశారు.

17 నుంచి పెద్దపాదం ప్రారంభం
సాధారణంగా శబరిమల యాత్రలో పెద్దపాదం మార్గాన్ని మకరవిళక్కు సీజన్(డిసెంబరు చివరి వారం) ప్రారంభానికి ముందు తెరుస్తారు. కొందరు భక్తులు పెద్దపాదం మీదుగా వస్తానని మొక్కుకుంటారు. ఈ నేపథ్యంలో మకరవిళక్కు సీజన్‌లో పెద్దపాదం మార్గంలో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. పైగా జాతీయ హరిత ధర్మాసనం(ఎన్‌జీటీ) ఆదేశాలు, వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలనే కేరళ హైకోర్టు ఆదేశాలతో పెద్దపాదం మార్గంలో రాత్రిళ్లు ప్రయాణంపై నిషేధం విధించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే భక్తులను అనుమతిస్తున్నారు. ఈ చర్యలతో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో.. మూడేళ్లుగా మండలం సీజన్‌లో కూడా పెద్దపాదం మార్గాన్ని తెరుస్తున్నారు. ఈ నెల 17న పెదపాదం మార్గాన్ని తెరిచేలా చర్యలు తీసుకుంటున్నామంటూ పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డైరెక్టర్(వెస్ట్) కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఈ సీజన్‌లోనే పులిమేడు మార్గం
ఇడుక్కి జిల్లాలోని వండిపెరియార్ నుంచి దట్టమైన పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా సత్రం, అక్కడి నుంచి పులిమేడు మీదుగా శబరిమలను చేరుకునే మార్గాన్ని తెరుస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి సీజన్ ప్రారంభం కావడంతో.. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌లో కూడా ఈ మార్గాన్ని చేర్చారు. ఇక్కడ కూడా ఉదయం 7 గంటల తర్వాతే భక్తులను అనుమతిస్తామని, సత్రం సుబ్రమణ్య స్వామి ఆలయం వద్ద పోలీసులు స్లాట్ ఎంట్రీ చేసుకుంటారని అధికారులు వివరించారు.


