పథనంతిట్ట: హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమలలో.. ధర్మశాస్తాకు నిలయమైన ఎరుమేలిలో రసాయనాల కుంకుమ విక్రయాలకు కేరళ హైకోర్టు కళ్లెం వేసింది. భక్తుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని, కెమికల్స్‌తో తయారైన కుంకుమను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ వి.రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. కేరళ ప్రభుత్వం ఈ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఇటీవల కేరళ ప్రభుత్వం పంపానదిలో సబ్బులు, షాంపూలను నిషేధించింది. అదేవిధంగా రసాయనాలతో తయారైన కుంకుమను ఎరుమేలి, శబరిమలలో విక్రయించడానికి వీలు లేదని తేల్చిచెప్పింది. సహజసిద్ధంగా తయారైన కుంకుమ విక్రయాలకు మాత్రమే అనుమతి ఉంటుందంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
శబరిమల, ఎరుమేలిలో వ్యాపారులకు కుంకుమను సరఫరా చేసే హోల్‌సేల్ వ్యాపారి ఒకరు ఈ ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేశారు. మండల, మకరవిళక్కు సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, రూ.లక్షలు ఖర్చు చేసి.. కుంకుమ స్టాక్ తెచ్చుకున్నామని, ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో నిషేధం విధిస్తే తాము నష్టపోతామని వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తమకు భక్తుల ఆరోగ్యమే ముఖ్యమని, కెమికల్స్‌తో తయారైన కుంకుమను అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. కేరళ సర్కారు ఉత్తర్వులను సమర్థించింది. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించింది.


