బీజేపీ.. ఇటీవల బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 202 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం కాగా, అందులో బీజేపీ 89 సీట్లతో దుమ్ములేపింది. ఇక మరో ఎన్డీఏ పక్షం జేడీయూ 85 సీట్లను సాధించి.. బీజేపీ కంటే వెనుకబడింది. దాంతో బిహార్‌లో బీజేపీ ప్రతిష్ట మరింత పెరిగింది.
ఇదిలా ఉంచితే, 2004 నాటికి బీజేపీ ఓవరాల్ ఎమ్మెల్యేల సంఖ్య 1035 ఉండగా, నేటికి ఆ సంఖ్య మరింత ముందుకెళ్లింది. 2025 నాటికి బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 1654గా ఉంది.
ఈ విషయాన్నే బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాలవీయ హైలైట్ చేశారు. సోమవారం(నవంబర్ 17వ తేదీ) దేశవ్యాప్త అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఎలా తన ఉనికిని కాపాడుకుంటూ ముందుకెళుతుందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. తాము ప్రస్తుతానికి సాధించిన సంఖ్య ఏదైతే ఉందో అది బీజేపీ రాజకీయ చరిత్రలో అత్యధికమన్నారు. మున్ముందు కూడా తమ పార్టీ వికాసం ఇలానే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారాయన. రాబోయే రెండేళ్లలో తమ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 1800కు చేరుతుందనే ధీమా వ్యక్తం చేశారు మాలవీయ.



