ట్రాన్స్‌జెండర్లకు ఇందిరమ్మ ఇళ్ల సరి్టఫికెట్లు అందిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు హర్కర, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్తాం
సింగరేణి సమస్యలపై త్వరలో సమావేశం: డిప్యూటీ సీఎం
గోదావరిఖని/ములుగు: గత పాలకుల మాదిరిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయనీయబోమని, అన్నిరంగాల్లో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్లి 2047నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో భట్టి ప్రసంగించారు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గానికి 3,500 మంది లబి్ధదారులను ఎంపిక చేశామన్నారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌కు రాష్ట్ర కేబినెట్‌లో ఆమోదం లభించిందని స్పష్టం చేశారు. త్వరలోనే మళ్లీ వస్తామని, పవర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తానని చెప్పారు.
సింగరేణి పరిరక్షణకు కృషి
సింగరేణి సంస్థ అభివృద్ధి, పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భట్టివిక్రమార్క అన్నారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజావసరాల కోసం నిత్యం తపిస్తున్న నాయకుడు రాజ్‌ఠాకూర్ అని ప్రశంసించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేపట్టిన యాత్రలో నా వెంట నడిచిన రాజ్‌ఠాకూర్‌కు ఆనాడే ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కొండా సురేఖ, ప్రిన్సిపల్ ఎనర్జీసెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ పాల్గొన్నారు.
రెండుమూడు రోజుల్లో మేడారం పనులు పూర్తి
సమ్మక్క–సారలమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా మేడారం జాతర నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌తో ఆదివారం మధ్యాహ్నం 3:26 గంటలకు మేడారం చేరుకున్నారు. కాన్వాయిలో ఆర్టీసీ పాయింట్, జంపన్న వాగు వద్దకు చేరుకొని వాహనంలో నుంచే పనులు పర్యవేక్షించారు. 3:50 గంటలకు హరిత హోటల్‌కు చేరుకొని అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రుల పర్యవేక్షణలో మేడారంలో అభివృద్ధి పనులు పూర్తికావొచ్చాయని తెలిపారు. రెండు మూడు రోజుల్లోగా మిగిలిన పనులు కూడా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. సమావేశ అనంతరం గద్దెల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. వారి వెంట మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సు«దీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు.


