పథనంతిట్ట: కర్ణాటక నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన కోటాయం సమీపంలో చోటుచేసుకుంది. భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ముండక్కయం సమీపంలోని అమరావతి వద్దకు రాగానే.. డ్రైవర్ కునికిపాటు కారణంగా రోడ్డుకు ఎడమపక్కనున్న గోడను బలంగా ఢీకొంది. ముందు సీటులో కూర్చున్న డ్రైవర్, మరో భక్తుడు క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. స్థానికులు, పోలీసులు గంటపాటు శ్రమించి, వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను మరో వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
అయితే.. క్షతగాత్రులను తరలిస్తున్న వాహనం.. కరినిలం వద్ద మరో కారును ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కాగా.. శబరి యాత్రికుల వాహనాలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా ఎక్కడికక్కడ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కేరళ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు వివరించారు. ఎక్కడికక్కడ సైన్ బోర్డులను ఏర్పాటు చేశామని, లోయలు ఉన్నచోట సేఫ్టీగా బారీకేడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా.. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఆదివారం సాయంత్రం తెరుచుకోగా.. భక్తుల రద్దీతో నీలక్కల్, పంపాబేస్, శబరిమల సన్నిధానం ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. సోమవారం ఉదయం పులిమేడు, పెద్దపాదం మార్గాలను అధికారులు ప్రారంభించారు.


