'సమోసాలో ఆలు ఉన్నంత కాలం.. బిహార్‌లో లాలూ ఉంటాడని..' బిహార్ రాజకీయ భీష్ముడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తరచుగా అంటుండే వారు. ఇప్పుడు సొంత కూతుళ్లే ఆయనను వదిలేసి వెళ్లిపోతున్నారు. తమ్ముడి మాయలో పడి తమను చిన్నచూపు చూస్తున్నారని తండ్రిని వేలెత్తి చూపిస్తున్నారు. తమకు గౌరవం లేని ఇంట్లో ఉండబోమంటూ తెగేసి చెబుతున్నారు.
చిన్న తమ్ముడు తేజస్వీ వైఖరి కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఘోర పరాజయం ఎదురైందని లాలూ రెండో కుమార్తె రోహిణీ ఆచార్య (rohini acharya) సంచలన ఆరోపణలు చేశారు. అతడి కారణంగా సొంత ఇంట్లోనే తనకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన చెందారు. పుట్టింటితో తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. రోహిణి చెల్లెళ్లు చందా సింగ్, రాగిణి యాదవ్, రాజ్యలక్ష్మి యాదవ్ కూడా పట్నాలోని పుట్టింటిని వదిలేసి ఢిల్లీకి వెళ్లిపోయారు. అటు పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ కూడా ఈ వ్యవహారంపై స్పందించాడు. తన అక్కను అవమానించిన వారిని వదిలిపెట్టబోనంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతా జరుగుతున్నా కుటుంబ పెద్ద లాలూ ప్రసాద్ ఇప్పటివరకు స్పందించలేదు.
చాలా సంవత్సరాలు పాటు బిహార్ రాజకీయాలను శాసించిన లాలూ ప్రసాద్.. తన సొంత కుటుంబంలో అలజడిని ఎలా ఎదుర్కొంటారోనని జనం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం వివరాలు తెలుసుకునేందుకు నెటిజనులు సోషల్ మీడియాలో తెగ శోధిస్తున్నారు. లాలూ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి 1973లో పెళ్లి చేసుకున్నారు. వీరికి మొత్తం 9 మంది సంతానం. వీరిలో ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. తేజస్వీ యాదవ్ (tejashwi yadav) అందరి కంటే చిన్నవాడు.
1. మీసా భారతి
లాలూ, రబ్రీదేవి దంపతుల పెద్ద కుమార్తె. ఎంబీబీఎస్ చదివిన ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 49 ఏళ్ల మీసా భారతి ప్రస్తుతం పాటలీపుత్ర నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో మీసా యాక్ట్ కింద లాలూ జైలుపాలయ్యారు. దీంతో తన పెద్ద కూతురికి మీసా అని పెట్టారు లాలూ.
2. రోహిణీ ఆచార్య
తన తండ్రికి కిడ్నీ దానం చేయడం ద్వారా వెలుగులోకి వచ్చారు లాలూ రెండో కుమార్తె రోహిణీ ఆచార్య. సింగపూర్‌లో ఎంబీబీఎస్ చదివిన సమరేశ్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. తాజాగా రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. పుట్టింటితో సంబంధాలు తెంచుకుంటున్నట్టు బహిరంగంగా ప్రకటించారు.
3. చందా సింగ్
లాలూ మూడో కుమార్తె అయిన చందా సింగ్.. ప్రజా జీవితంలో లేరు. మిగతా తోబుట్టువులతో పోలిస్తే ఆమె బయట కనిపించింది చాలా తక్కువ. పైలట్ విక్రం సింగ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు.
4. రాగిణి యాదవ్
ఇంజినీరింగ్ విద్య పూర్తి చేయకుండానే మధ్యలో వదిలేశారు లాలూ నాలుగో కుమార్తె అయిన రాగిణి యాదవ్. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రాహుల్ యాదవ్‌ను ఆమె పెళ్లాడారు.
5. హేమ యాదవ్
లాలూ ప్రసాద్ 5వ కుమార్తె అయిన హేమ యాదవ్ బీటెక్ వరకు చదివారు. వినీత్ యాదవ్‌ను వివాహం చేసుకున్నారు. ఈమె కూడా పబ్లిక్‌లో ఎక్కువ కనబడరు.
6. అనుష్క రావు
అనుష్కను కుటుంబ సభ్యులు ముద్దుగా దన్ను అని పిలుస్తుంటారు. ఇంటీరియర్ డిజైనింగ్, న్యాయ విద్య చదివారు. హరియాణా రాజకీయ కుటుంబానికి చెందిన చిరంజీవ్ రావుతో ఆమె పెళ్లి జరిగింది.
7. రాజ్యలక్ష్మి
లాలూ ప్రసాద్ చిన్న కుమార్తె అయిన రాజ్యలక్ష్మి ప్రైవేటు యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశారు. రాజకీయ కుటుంబానికి తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్‌ను వివాహం చేసుకున్నారు.

8. తేజ్ ప్రతాప్ యాదవ్
లాలూ ప్రసాద్ పెద్ద కొడుకైన తేజ్ ప్రతాప్ ఇంటర్మీయట్ వరకు చదువుకున్నారు. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. బిహార్ రాష్ట్ర మంత్రిగా గతంలో పనిచేశారు. బాధ్యతా రహిత ప్రవర్తన కారణంగా తండ్రి ఆగ్రహానికి గురయ్యారు. దీంతో కుటుంబం, పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. జనశక్తి జనతాదళ్ పేరుతో పార్టీ పెట్టి, తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. కుటుంబ గొడవల నేపథ్యంలో అక్క రోహిణీ ఆచార్యకు బాసటగా నిలిచారు.
9. తేజస్వీ యాదవ్
అందరికంటే చిన్నవాడైన తేజస్వీ యాదవ్ రాజకీయాల్లో లాలూ వారసుడిగా చెలామణి అవుతున్నారు. కేవలం పదకొండో తరగతి వరకు మాత్రమే చదివిన తేజస్వీ.. రాజకీయంగా మాత్రం అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బిహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన భార్య పేరు రాజశ్రీ యాదవ్. వీరికి ఇద్దరు సంతానం.
చదవండి: డర్టీ కిడ్నీ అంటూ దూషించారు


